Stocks to watch today, 15 September 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 10 పాయింట్లు లేదా 0.06 శాతం గ్రీన్‌లో 18,000 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్: వందేళ్ల అనుభవం ఉన్న ఈ ప్రైవేట్ బ్యాంక్‌, ఇవాళ దలాల్ స్ట్రీట్‌లోకి అరంగేట్రం చేస్తోంది. ఈ నెల 5-7 తేదీల మధ్య జరిగిన ఐపీవోలో రూ.500-525 రేంజ్‌లో షేర్లను విక్రయించింది, రూ.831.6 కోట్లను సమీకరించింది. లిస్టింగ్‌కు ముందు, గ్రే మార్కెట్‌లో రూ.10-12 కొద్దిపాటి ప్రీమియంతో ట్రేడయింది.


టాటా స్టీల్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) జారీ ద్వారా రూ.2,000 కోట్లను సమీకరించనున్నట్లు ఈ స్టీల్ మేజర్ తెలిపింది. NCDల రూపంలో రుణ పత్రాలు జారీ చేయడానికి నిన్న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోదించిందని వెల్లడించింది.


వేదాంత: వాణిజ్య బొగ్గు గనుల వేలంలో రెండో రోజు, ఒడిశాలోని రెండు బొగ్గు గనులకు ఈ కంపెనీ ఎక్కువ కోట్‌ చేసి అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. మంగళ, బుధవారాల్లో జరిగిన వాణిజ్య బొగ్గు గనుల వేలం ద్వారా ప్రభుత్వం 10 బొగ్గు గనులను విక్రయించింది.


టాటా పవర్: టాటా మోటార్స్ పుణె ప్లాంట్‌లో 4 MWp సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ టాటా గ్రూప్ యుటిలిటీ విభాగం తెలిపింది. టాటా మోటార్స్ - టాటా పవర్ మధ్య ఈ  పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగింది.


బాలాజీ అమైన్స్: తాము నిర్మిస్తున్న 90 ఎకరాల గ్రీన్‌ ఫీల్డ్ ప్రాజెక్టులో (యూనిట్ - IV) మొదటి దశ పూర్తయిందని ఈ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఎక్సేంజీలకు తెలిపింది. డి-మిథైల్ కార్బోనేట్, ప్రొపైలిన్ కార్బోనేట్, ప్రొపైలిన్ గ్లైకాల్ ప్లాంట్ ద్వారా ఈ నెల చివరి నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొంది.


ఐడీబీఐ బ్యాంక్: బ్యాంక్‌ ప్రైవేటీకరణ కోసం చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నట్లు దీపమ్‌ (DIPAM) సెక్రటరీ తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ప్రస్తుతం ఆసక్తి వ్యక్తీకరణలను (EoI) పరిశీలిస్తున్నామని; పెట్టుబడిదారుల నుంచి ప్రాథమిక బిడ్‌లను త్వరలో ఆహ్వానిస్తామని తెలిపారు.


జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌: రోడ్లు, హైవేలు నిర్మించే ఈ కంపెనీ ప్రమోటర్లు- లక్ష్మీ దేవి అగర్వాల్, సుమన్ అగర్వాల్, రీతూ అగర్వాల్, లలితా అగర్వాల్, సంగీతా అగర్వాల్, కిరణ్ అగర్వాల్, మనీష్ గుప్తా 57,04,652 ఈక్విటీ షేర్లు లేదా 5.9 శాతం వాటాను విక్రయిస్తారు. ఇవాళ, రేపు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ అమ్మకం జరుగుతుంది. ఫ్లోర్‌ ప్రైస్‌ను రూ.1,260 గా నిర్ణయించారు.


హెచ్‌ఎఫ్‌సీఎల్‌: భారత్ సంచార్ నిగమ్ (BSNL) నుంచి రూ.341.26 కోట్లు, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రూ.106.55 కోట్ల విలువైన (మొత్తం రూ.447.81 కోట్లు) అడ్వాన్స్‌డ్‌ పర్చేజ్‌ ఆర్డర్‌లను ఈ టెలికాం గేర్ తయారీ కంపెనీ దక్కించుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.