అఫ్గానిస్థాన్ ను చేజిక్కించుకోవడానికి దాదాపు రెండు దశాబ్దాలుగా తాలిబన్లు పోరాడుతున్నారు. ఎట్టకేలకు వారం రోజుల క్రితం కాబూల్ ను హస్తగతం చేసుకొని ప్రభుత్వంపై విజయం సాధించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి కీలక ప్రకటన చేయలేదు. దీనికి కారణమేంటి? ఎలాంటి అడ్డుంకులు లేకపోయినా ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదు?


అమెరికా డెడ్ లైన్..


తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడానికి ప్రధాన కారణం అమెరికా అని సమాచారం. ఆగస్టు 31 నాటికి తమ దళాలను అఫ్గానిస్థాన్ నుంచి పుర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించింది. అప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని తాలిబన్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దళాలు వెనుదిరిగే వరకు ఎలాంటి చర్యలు చేపట్టకూడదని అమెరికా- తాలిబన్ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్​ అధికారి వెల్లడించారు. దీంతో ప్రపంచం చూపు ఆగస్టు 31పై ఉంది. ఆ తర్వాత తాలిబన్లు అఫ్గాన్ లో ఎలాంటి అరాచకం సృష్టిస్తారో అని ఆందోళన చెందుతున్నాయి ప్రపంచదేశాలు.


Also Read: Pakistan Mindest : ఆమె వేసుకున్న బ్రా కలరే వాళ్లకు ముఖ్యం... స్వాతంత్ర్యం దినోత్సవం కాదు ! పాకిస్తాన్ జనం తీరుపై నటి ఫైర్


అమెరికా సంగతేంటి?


మరోవైపు తమ దళాలను, ప్రజలను అఫ్గానిస్థాన్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పరిణామాలతో అమెరికా ప్రణాళికలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు 5,700 మందిని విమానాల ద్వారా దేశాన్ని దాటించింది అమెరికా మిలిటరీ. ఇంకా వేలమందికిపైగా ప్రజలు అఫ్గాన్​లోనే ఉన్నారు. అనుకున్న తేదీలోగా మిగిలిన వారిని రక్షించడం, సైన్యాన్ని వెనక్కి రప్పించడం చిన్న విషయేమేం కాదు.


భయాందోళన..


అమెరికాతో పాటు యూకే, స్పెయిన్, భారత్ వంటి దేశాలు.. అఫ్గానిస్థాన్ నుంచి తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు కృషి చేస్తున్నాయి. అయితే తాలిబన్ల భయంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటకి రావడానికి కూడా భయపడుతున్నారు. కొంతమంది విమానాశ్రయం వరకు చేరుకున్నా విమానం ఎక్కే వరకు టెన్షన్ తప్పట్లేదు. ఇటీవల కాబూల్ విమానాశ్రయంలో జరిగిన తొక్కిసలాట, కాల్పులు వంటి ఘటనలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరి ఇప్పుడు ఆగస్టు 31 తర్వాత అఫ్గాన్ లో పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటాయేమోనని అందరూ భయపడుతున్నారు. మరి ఆగస్టు 31 తర్వాత ఏమవుతుందో చూడాలి.


Also Read: Covid19 Update: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వస్తుంది.. ఎందుకిలా?