Covid19 Update: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వస్తుంది.. ఎందుకిలా?

ABP Desam   |  20 Aug 2021 06:45 PM (IST)

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్నప్పటికీ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నవారికి కూడా కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది.

డెల్టా వేరియంట్ విజృంభణ

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు ప్రధాన కారణం డెల్టా వేరియంట్ అని ఇన్సాకాగ్ (ఐఎన్ఎస్ఏసీఓజీ) నివేదిక తెలిపింది. ఈ అధ్యయనంలో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినవారికి కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది.

డెల్టా వేరియంట్ విజృంభించడమే కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. వేరియంట్లపై వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గడం కూడా ఓ కారణమని పేర్కొంది.  వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కావాలని మరణాల రేటు తగ్గాలంటే ఇదే ప్రధాన మార్గమని వెల్లడించింది.

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం కూడా డెల్టా వేరియంట్ విజృంభణలో కీలకంగా ఉంది. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ ప్రభావంపైనా అధ్యయనం జరుగుతుంది.        -    ఐఎన్ఎస్ఏసీఓజీ నివేదిక

భారత్, చైనా, కొరియా సహా ఇతర దేశాల్లో డెల్టా వేరియంట్ ఆందోళన నెలకొంది. కేసుల్లో విజృంభణకు ప్రధాన కారణం డెల్టా ప్లస్ కే417ఎన్ అని కొరియా నిర్ధారించింది.

సెకండ్ వేవ్ లో కరోనా విజృంభణకు డెల్టా వేరియంటే కారణమని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా ధాటికి దేశంలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.

ఇప్పటివరకు 61 డెల్టా ప్లస్ వేరియంట్లు దేశంలో గుర్తించారు. మే లో పీక్ స్టేజ్ లో ఉన్న కరోనా వైరస్ కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

Also Read: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ 5 ఆహారాలను తప్పక తీసుకోవాలి

కేరళ ఆందోళన..

గత రెండు నెలలుగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో నమోదయ్యే కేసులలో సగానికి పైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసులలో 20 వేలకు పైగా కేరళ రాష్ట్రం నుంచే నిర్ధారణ అయ్యాయి. అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కరోనా టీకాల రెండో డోస్‌ను నిర్ణీత సమయంలో తీసుకోని వారు 3.86 కోట్ల మంది వరకు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. తప్పనిసరిగా తమ రెండో టీకాను నిర్ణీత సమయానికి తీసుకుంటే కరోనా తీవ్రత తక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Published at: 20 Aug 2021 06:36 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.