చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపాదించిన త్రీ చైల్డ్ పాలసీకి నేడు పార్లమెంటు ఆమోదం పలికింది. జననాల రేటు ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో నెమ్మదించడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది చైనా.
కొద్దికాలం కిందట వరకు చైనాలో కేవలం ఒక్కరిని కనడానికి అనుమతి ఉండేది. దాన్ని సడలిస్తూ కొద్దికాలం కిందట ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతించారు. దాన్నిప్పుడు ముగ్గురు పిల్లల వరకు కనొచ్చంటూ నిబంధనలు సడలించారు.
అంతేకాదు..
అయితే ఆర్థిక భారం కారణంగా ఎక్కువ మంది పిల్లలను కనలేని తల్లిదండ్రులకు సామాజిక, ఆర్థిక సాయాన్ని కూడా ఇచ్చేందుకు ఈ చట్టంలో మార్పులు చేసింది ప్రభుత్వం.
పన్నులు, బీమా, చదువు, హౌసింగ్, ఉద్యోగాల విషయంలో ఆర్థిక భారం మోస్తోన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోనుంది.
పదేళ్లకోసారి..
చైనాలో ప్రతి పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు విడుదల చేస్తారు. ఈ ఏడాది గణాంకాలు ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని రోజులు ఆలస్యమైంది. 2020లో సుమారు 70 లక్షలమంది జనగణన అధికారులు ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలు సేకరించారు.
చైనాలో జనాభా లెక్కల సేకరణను అత్యంత సమగ్రంగా నిర్వహిస్తారు. భవిష్యత్తు ప్రణాళికను రచించేందుకు కచ్చితమైన జనాభా లెక్కలు ముఖ్యమని భావిస్తారు. గత ఏడాది చైనాలో 1.2 కోట్ల శిశువులు జన్మించారని, 2016లోని నవజాత శిశువుల సంఖ్య(1.8 కోట్లు)తో పోలిస్తే ఈ సంఖ్య బాగా తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.
ఒక దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే, సంతానోత్పత్తి రేటు సహజంగా తగ్గుతుంది. అభివృద్ధి కారణంగా అక్షరాస్యత పెరగడం, ఎక్కువమంది కెరీర్ మీద దృష్టి పెట్టడం, ఇతర సామాజిక అంశాల కారణంగా సంతానోత్పత్తి తగ్గుతుంది. జపాన్, దక్షిణ కొరియాలాంటి దేశాల్లో కూడా ఇటీవల కాలంలో సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో తగ్గుతూ కనిపిస్తోంది.
జనాభా తగ్గుతున్నకొద్దీ వృద్ధుల సంఖ్య పెరిగి యువత సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఇది దేశ ఉత్పత్తిని, ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తుంది. 2010 జనాభా లెక్కలతో పోలిస్తే చైనాలో 16 నుంచి 59 సంవత్సరాల వయసు జనాభా 4 కోట్లు తగ్గిందని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి.
Also Read:
Taliban in Kabul: అరాచకంగా తాలిబన్ల తీరు.. మూసేసిన భారత ఎంబసీల్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు