Srikakulam News: ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రంజీ ట్రోఫీ మాజీ ఆటగాడిగా చెప్పుకుంటున్న 30 ఏళ్ల వ్యక్తిని శ్రీకాకుళం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు బుడుమూరు నాగరాజు వద్ద 24 కిలోల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి కలుపును కొనుగోలు చేసి, కిలో రూ.80 వేలకు పైగా పలుకుతున్న ముంబైకి తరలించేందుకు నాగరాజు పథకం వేశాడు. అయితే పక్కా సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. గంజాయి నేరాలకు సంబంధించి నాగరాజు అరెస్టు కావడం ఇదే మొదటిసారి కాదు. 


మంత్రి కేటీఆర్ పీఏని అంటూ 40 లక్షలు స్వాహా..!


2021లో తెలంగాణ మంత్రి కేటీ రామారావు వ్యక్తిగత కార్యదర్శిగా చెప్పుకొని తిరుగుతూ నాగరాజు చాలా మందిని మోసం చేశాడు. తొమ్మిది కార్పొరేట్ సంస్థల వద్ద మొతత్ం రూ. 40 లక్షలకు పైగా మోసం చేశాడు. ఈ కేసులో తెలంగాణ పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు. గతంలో కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనుకరించి ముంబైకి చెందిన వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో అరెస్టయ్యాడు.


శ్రీకాకుళంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాగరాజు తాను ఎంబీఏ చదివినట్లు, అలాగే మాజీ రంజీ ట్రోఫీ ప్లేయర్ అని చెబుతున్నట్లు వివరించారు. అయితే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఈ వాదనలను ఖండించింది. నాగరాజు ఎప్పుడూ రంజీ ట్రోఫీకి ఆడలేదని పేర్కొంది. శ్రీకాకుళం పోలీసులు నాగరాజుపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Also Read: విశాఖలో 1000 కేజీల గంజాయి స్వాధీనం- ఐదుగురు వ్యక్తుల ముఠా అరెస్టు


ఇటీవల విశాఖలో గంజాయి తరలింపు - ఐదుగురి అరెస్ట్


విశాఖలో అక్రమంగా తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని వైజాగ్ పోలీసులు పట్టుకున్నారు . పక్క రాష్ట్రం ఒడిశా, ఏపీలోని అల్లూరి జిల్లాల నుంచి దిగుమతి చేసుకుని విశాఖ మీదుగా తమిళనాడుకు స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఇలా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను వైజాగ్ పోలీసులు పట్టుకున్నారు. 






గంజాయి స్మగ్లింగ్ సమాచారాన్ని ముందే తెలుసుకున్న పోలీసులు.. వైజాగ్‌లోని ఆనందపురం, వేములవలస ఫ్లై ఓవర్ బ్రిడ్జి, వై జంక్షన్ వద్ద కాపు కాశారు. వెహికల్స్‌ను చెక్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యాన్‌  రాగానే ఆపి తనిఖీలు చేశారు. అందులో మొత్తం 25 బ్యాగుల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఒక్కే బ్యాక్‌ 40 కేజీల చొప్పున మొత్తం 1000 కేజీల గంజాయిని రవాణా అవుతున్నట్టు తేల్చారు. వెహికల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో సీహెచ్ సూర్యం, అనపర్తి ప్రసాద్, లోవరాజు, రాజుబాబు, సూరిబాబు ఉన్నారు. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర నుంచి తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలకు గంజాయి చేరవేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని విశాఖ సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. 


Also Read: Konaseema: కోనసీమ జిల్లాలో గంజాయి కలకలం, ఐదుగురు అరెస్టు - సమాచారం ఇచ్చేవారికి పోలీసుల బంపర్ ఆఫర్!