కోనసీమ జిల్లాలో గంజాయి గురించిన కచ్చితమైన సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు వారికి రూ.50 వేలు తక్షణ బహుమతి ఇస్తామని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ తెలిపారు. జిల్లాలోని రామచంద్రపురం సర్కిల్ పరిధిలో అయిదుగురుని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 

జిల్లాలో గంజాయి పై స్పెషల్ డ్రైవ్..

 

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు గంజాయి చేరవేస్తున్నారనే సమాచారంతో ప్రత్యేక నిఘా ఉంచి అయిదుగుర్ని అరెస్ట్ చేసి 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపారు. గంజాయి మూలాలు ఎక్కడ వున్నా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జల్లెడ పడుతున్నామన్నారు. ఇప్పటి వరకు 133 మంది గంజాయి సరఫరా, తాగే వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితులపై గంజాయి షీట్స్ ఓపెన్ చేస్తామని.. ఎవరు అయినా ఈ సంఘటనలపై సమాచారం ఇస్తే వారికి రూ.50 వేలు అవార్డు కూడా అందిస్తామన్నారు.

 

అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో సెబ్ ప్రత్యేకంగా పనిచేస్తున్నారన్నారు. ఒరిస్సా ప్రాంతం నుంచి వివిధ మార్గాల ద్వారా  పోలీస్ బృందాల సహాయంతో గంజాయి పై దాడులు నిర్వహించడం జరుగుతోందన్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలలో ప్రత్యేక సదస్సులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యమైన కూడళ్ల లో మాదక ద్రవ్యాల వినియోగ నియంత్రణకు సంబందించిన హోర్డింగ్ లను ఏర్పాటు చేసి యువతపై మాదకద్రవ్యాల ప్రభావం పడకుండా వారి భవిష్యత్తు నాశనం కాకుండా ఉండడం కోసం గత కొన్ని రోజులుగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ శ్రీధర్ అన్నారు. 

 

అయిదుగురు అరెస్ట్..

 

రామచంద్రపురం సర్కిల్ పరిధిలో నిఘా ద్వారా అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నమన్నారు పోలీసులు. పెదపూడి మండలం చింతల లాకులకు చెందిన వాసంశెట్టి బన్నీ, కాకినాడ టౌన్, కొండయ్యపాలెంకు చెందిన మర్రెడ్డి దినేశ్వరరావు, రామచంద్రపురం మండలం  పెదతాళ్లపొలం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి సత్యనారాయణ, ప్రత్తిపాడు మండలం బావురువాక కు చెందిన కించు అప్పారావు, పిఠాపురం టౌన్ అగ్రహానికి చెందిన సంఘటాల రాజేష్ ఈ ఘటనలో పాత్ర దారులు అని ఎస్పీ తెలిపారు. ఆంద్రప్రదేశ్ డీజీపీ  కె. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో సాగిన ఈ నిఘా లో అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తులు గంజా పట్ల ఆకర్షణ అవుతున్నారని తేలిందని వెల్లడించారు.