విశాఖ జిల్లాలో వాలంటీర్‌ దారుణానికి పాల్పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వాలంటీర్‌ దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ వృద్దురాలిని హత్య  చేశాడు. 


విశాఖ జిల్లా పెందుర్తిలో వాలంటీర్ వెంకట్‌ హత్య చేశాడు. సుజాతనగర్ 80 ఫీట్ రోడ్‌లో 72 ఏళ్ల వృద్ధురాలిని బంగారం కోసం చంపేశాడు. వరలక్ష్మి అనే వృద్ద మహిళను కిరాతకంగా హతమార్చాడు. నిందితుడు 95 వార్డు పురుషోత్తపురంలో వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. 


వాలంటీర్ వెంకట్‌ నెల రోజుల క్రితం వృ‌ద్ధురాలి కుమారుడు వద్ద పనికి చేరాడు. అతను ఫుడ్ కోర్టు నిర్వహిస్తున్నాడు. అందులో వెంకట్ పని చేస్తున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని వృద్దురాలిని హత్య చేసి బంగారంతో ఉడాయించాడు. రాత్రి పది గంటల సమయంలో ఈ దారుణం జరిగింది నిందితుడు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. 


బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడు వెంకట్‌గా గుర్తించారు. అలా గుర్తించిన గంటల వ్యవధిలోనే హంతకుడిని పట్టుకున్నారు. చనిపోయిన వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.