విశాఖలో అక్రమంగా తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని వైజాగ్ పోలీసులు పట్టుకున్నారు . పక్క రాష్ట్రం ఒడిశా, ఏపీలోని అల్లూరి జిల్లాల నుంచి దిగుమతి చేసుకుని విశాఖ మీదుగా తమిళనాడుకు స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఇలా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను వైజాగ్ పోలీసులు పట్టుకున్నారు. 


గంజాయి స్మగ్లింగ్ సమాచారాన్ని ముందే తెలుసుకున్న పోలీసులు.. వైజాగ్‌లోని ఆనందపురం, వేములవలస ఫ్లై ఓవర్ బ్రిడ్జి, వై జంక్షన్ వద్ద కాపు కాశారు. వెహికల్స్‌ను చెక్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యాన్‌  రాగానే ఆపి తనిఖీలు చేశారు. అందులో మొత్తం 25 బ్యాగుల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఒక్కే బ్యాక్‌ 40 కేజీల చొప్పున మొత్తం 1000 కేజీల గంజాయిని రవాణా అవుతున్నట్టు తేల్చారు. 


వెహికల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో సీహెచ్ సూర్యం, అనపర్తి ప్రసాద్, లోవరాజు, రాజుబాబు, సూరిబాబు ఉన్నారు. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర నుంచి తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలకు గంజాయి చేరవేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని విశాఖ సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. 


వైజాగ్‌లో అంతర్రాష్ట్ర దొంగ పట్టివేత 
గత కొన్నిరోజులుగా విశాఖ నగరవాసులను భయపెడుతున్న ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతను అంతరాష్ట్ర దొంగగా గుర్తించారు. ఆయనకు సహకరించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 6న NAD జంక్షన్ వద్ద ఉ్న వాసవీ ప్యారడైజ్ అపార్ట్మెంట్స్‌లో చోరీ జరిగింది. డాక్టర్ సాహిత్య ఇంట్లో వాళ్లు నిద్రపోతున్న టైంలో ఈ ముఠా దోపిడీ చేసింది. 


ఈ దోపిడీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేశారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బైక్‌ చోరీ సమయంలో ఉపయోగించినట్టు గుర్తించారు. ఆ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తే శివాజీ పాలెం వాసి అనిల్‌ చిక్కాడు. అతన్ని పట్టుకొని పోలీసులు పట్టుకొని ప్రశ్నిస్తే చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. 


అనిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు డాక్టర్ సాహిత్య ఇంట్లో దోపిడీ చేసిన 181 గ్రాముల బంగారంతో పాటు అర కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 5 లక్షలపైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. అనిల్ కుమార్‌పై 45 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసుల్లో 14 కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయని సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు . 


అనిల్‌తోపాటు అతనికి సహకరించిన లక్ష్మణరావు, రమణి, గురుమూర్తి అనే వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.