Sri Lankan President:
మాకు ఎంతో సహకరించారు: రణిల్ విక్రమసింఘే
శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి థాంక్స్ చెప్పారు. కష్టకాలంలో తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. "మాకు మిత్రదేశమైన భారత్, ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంది. మా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సహకరించింది" అని అన్నారు రణిల్. శ్రీలంక ప్రజల తరపున భారత్‌కు, భారత దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. "ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం, మాకు కొత్త ఊపిరినిచ్చింది. నాతో పాటు మా ప్రజల తరపున ప్రధాని మోదీ, భారత దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు" అని చెప్పారు. ఎన్నో నెలలుగా శ్రీలంకలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెర దించుతూ అధ్యక్ష పదవి చేపట్టారు రణిల్ విక్రమసింఘే. ఆయన అధ్యక్షతన మొదటి సారి పార్లమెంట్ జరిగింది. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స, శ్రీలంక వదిలి పారిపోయిన తరవాత రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో ఆయనే అధ్యక్షుడిగా గెలిచారు.
నిరసనలపై అధ్యక్షుడి ఆగ్రహం
శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. అంతకు ముందు ప్రధానిగా ఉన్నప్పుడే ఆయనను అంగీకరించని లంకేయులు..అధ్యక్ష పదవిలో ఉండటాన్ని అసలు ఒప్పుకోవటం లేదు. తీవ్రంగా నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన ఇంటికి నిప్పుపెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనల్లో భాగంగానే ఆందోళన కారులు
ఓ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. "ఇంటికి వెళ్లిపో" అంటూ రణిల్ విక్రమసింఘేను ఉద్దేశిస్తూ నినదిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామా లుంటాయని హెచ్చరిస్తున్నారు. కొంత కాలంగా దీనిపై అక్కడ వేడి రాజుకుంటోంది. మొత్తానికి ఈ అంశంపై స్పందించారు రణిల్ విక్రమసింఘే. తనను ఇంటికి వెళ్లిపోమనటంలో అసలు అర్థమే లేదని కొట్టి పారేశారు. "నేను ఇంటికి వెళ్లిపోవాలని కొందరు బెదిరిస్తున్నారు. వాళ్లందరికీ నేనొక్కటే చెబుతున్నా. వెళ్లటానికి నాకు ఓ ఇల్లంటూ లేదు. అందుకే ఇలా డిమాండ్ చేయటం మానుకోండి" అని బదులిచ్చారు. ఇలాంటి డిమాండ్‌లతో సమయం వృథా చేసుకోకూడదని, దాని బదులు కాల్చేసిన తన ఇంటిని రీబిల్డ్ చేయాలని ఆందోళనకారులకు సూచించారు. "ఇల్లే లేని వ్యక్తిని, ఇంటికి వెళ్లిపోమని అరవటంలో ఎలాంటి అర్థమూ లేదు" అని అంటున్నారు రణిల్ విక్రమసింఘే.
Also Read: ఓటీటీలు కాదు, రాజమౌళీయే అసలైన శత్రువు - ఆర్జీవీ వ్యాఖ్యలు
Also Read: Subramanian Swamy Comments: 'మోదీ మత్తులో మాట్లాడుతున్నారు'- BJP ఎంపీ సంచలన వ్యాఖ్యలు