ఏనుగుకి నాలుగో పుట్టిన రోజు..


యూపీలోని బిజ్నోర్‌లో నాలుగేళ్ల వయసున్న ఏనుగుకి బర్త్‌డే వేడుకలు జరిపించారు. చుట్టుపక్కల బెలూన్స్ కట్టి, ఫ్రూట్ కేక్ కట్ చేయించారు. ఏనుగులు ఈ పార్టీకి వచ్చి కేక్ ఆరగించి వెళ్లాయి. బిజ్నోర్‌లోని "కలగర్ ఎలిఫెంట్ క్యాంప్‌లో" జరిగింది ఈ వింతైన పార్టీ. ఆగస్టు 2వ తేదీతో సావన్ (ఏనుగు పేరు)కు నాలుగేళ్లు నిండిన సందర్భంగా...అటవీ అధికారులు ఇలా వెరైటీగా వేడుక చేశారు. యూపీ-ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉన్న జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలోనే ఉందీ కలగర్ ఎలిఫెంట్ క్యాంప్. ఈ సావన్‌ కోసం ప్రత్యేకంగా ఫ్రూట్ కేక్ తయారు చేయించారు. కేక్ కట్‌ చేయించటాన్ని చూసిన మిగతా ఏనుగులు ఒక్కసారిగా అక్కడికి వచ్చాయి. ఇప్పుడే కాదు. సావన్ పుట్టినప్పటి నుంచి ఆగస్టు 2వ తేదీన బర్త్‌డే వేడుకలు చేస్తున్నారు అటవీ అధికారులు. ప్రస్తుతం ఈ క్యాంప్‌లో 9 ఏనుగులు ఉంటున్నాయి. వీటిని 9 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి తీసుకువచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం కాంచభ అనే ఏనుగుకి పుట్టిన ఏనుగుకి సావన్ అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఘనంగా బర్త్‌డే సెలబ్రేట్ చేస్తున్నారు. కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో భాగమైన ఈ ఎలిఫెంట్ క్యాంప్‌లో ఏనుగుల సంరక్షణకు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. మాన్‌సూన్ పాట్రోలింగ్‌ కోసం ఈ ఏనుగులను వినియోగిస్తారు. వీటికి అవసరమైన మందులు, ఆహారం, డ్రింక్స్‌, వసతి ఏర్పాట్లు అన్నీ చేసినట్టు అధికారులు వెల్లడించారు.





 


హ్యాపీ బర్త్‌డే గజరాజ్..


సావన్ బర్త్‌డే పార్టీని అధికారులంతా ఎంజాయ్ చేశారు. ఏనుగు కేక్ కట్ చేసే సమయంలో అందరూ చప్పట్లు కొడుతూ సందడి చేశారు. సావన్ కూడా ఎంతో ఆనందంగా ఆ కేక్‌ను ఆరగించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌ అయ్యాయి. హ్యాపీ బర్త్‌ డే గజరాజ్ అంటూ కొందరు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు. ఈ ఏనుగుకి ముందుగా శంభు అనే పేరు పెట్టారు. తరవాత సావన్‌గా మార్చారు.