5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ పీసీసీ చీఫ్‌లు తక్షణమే వారి పదవులకు రాజీనామా చేయాలని సోనియా గాంధీ ఆదేశించారు.
ఈ మేరకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. పార్టీని మళ్లీ పునర్నిర్మించడమే లక్ష్యంగా పార్టీ ఈ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు సుర్జేవాలా పేర్కొన్నారు. ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ గణేశ్ గొదియాల్ తన పదవికి రాజీనామా చేశారు.
ఘోర ఓటమి
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అన్నీ తానై స్వయంగా ప్రియాంక గాంధీ పార్టీని నడిపించినా ఫలితాలు ఘోరంగా వచ్చాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించింది. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీ శ్రేణులను నిరాశ పరిచింది.
కనీసం గోవా అయినా తమకు దక్కుతుందని గంపెడాశ పెట్టుకున్న పార్టీకి నిరాశే ఎదురైంది. పంజాబ్లో పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల అధికారం కోల్పోవడంతో పాటు సీనియర్ నేతలంతా ఇంటి బాట పట్టారు. దీంతో పార్టీ అసమ్మతి నేతలు (జీ 23 నేతలు) ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమికి బాధ్యులెవరో తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు.
దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లను రాజీనామా చేయాలని ఆదేశించారు. మరి ఈ రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందో లేదో చూడాలి.
Also Read: Hijab Ban Verdict: హిజాబ్‌పై హైకోర్టు తీర్పులో కీ పాయింట్లు ఇవే- ఇవి గమనించారా?
Also Read: Modi on Kashmir Files: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ కీలక వ్యాఖ్యలు- ఏమన్నారో తెలుసా?