Modi on Kashmir Files: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై రాజుకున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా ఈ చిత్రంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూాడా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. 'ద కశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాలు మరిన్ని రావాలని.. వీటి వల్ల ప్రజలకు నిజాలు తెలుస్తాయని మోదీ అన్నారు. భాజపా పార్లమెంటరీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 







కశ్మీర్‌ లోయ నుంచి పండిట్లపై జరిగిన దాడులు, వాళ్లని తరిమికొట్టిన విధానాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెండితెరపై చూపించేందుకు ద కశ్మీర్ ఫైల్స్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 11న ఈ సినిమా విడుదలైంది. 1990లలో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది.


డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, ఆయన భార్య నటి పల్లవి జోషి, నిర్మాత అభిషేక్ అగర్వాల్.. గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా చిత్రాన్ని మోదీ ప్రశంసించినట్లు తెలిపారు. 


వివాదం


అయితే ఈ చిత్రంపై రాజకీయ వివాదం రాజుకుంది. కేరళ కాంగ్రెస్.. ఈ చిత్రంపై వరుస ట్వీట్లు చేసింది. 1990-2007 మధ్య కాలమైన 17 ఏళ్లలో కశ్మీర్ పండిట్ల కంటే ఎక్కువ మంది ముస్లింలను హత్య చేశారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కశ్మీర్ లోయ నుంచి పండిట్లను వెళ్లగొట్టే సమయంలో జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్న జగ్‌మోహన్ ఓ ఆర్ఎస్ఎస్ వ్యక్తని కాంగ్రెస్ తెలిపింది. అంతేకాకుండా ఆ సమయంలో కేంద్రంలో భాజపా మద్దతిచ్చిన వీపీ సింగ్ సర్కార్ అధికారంలో ఉందని వెల్లడించింది. 










భాజపా సెటైర్


ఈ విమర్శలను భాజపా తిప్పికొట్టింది. ఈ చిత్రం ద్వారా కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని భాజపా ఆరోపించింది. ఇలాంటి చిత్రాల ద్వారా కాంగ్రెస్ చేసిన దారుణాలు, రాజకీయాలు బయటకు వస్తున్నాయని విమర్శించింది.


Also Read: Hijab Ban Verdict: హిజాబ్‌పై హైకోర్టు తీర్పులో కీ పాయింట్లు ఇవే- ఇవి గమనించారా?