Prisoners Escaped from Mudigonda Police Station: పోలీస్‌ స్టేషన్‌లో పోలీసుల కన్నుగప్పి ఇద్దరు దొంగలు పరారయ్యారు. కాళ్లకు ఉన్న బేడీలను సైతం సినీ పక్కీలో కోసేసుకుని తాపీగా పరారయ్యారు. పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు పహారా కాస్తునప్పటికీ ఇద్దరు దొంగలు చాకచక్యంగా తప్పించుకున్న ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్‌ స్టేషన్‌లో సంచనలంగా మారింది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ముదిగొండ మండలంలోని బాణాపురం సమీపంలో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇద్దరు దొంగలు తాము చేసిన దొంగతనాల గురించి చర్చించుకుంటుండంతో పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు ఇద్దరిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దొంగతనం కేసులపై వీరిపై ఆరోపణలు ఉండటంతో కాళ్లకు బేడీలు వేసి ఇద్దరిని విచారిస్తున్నారు.
బాతురూంలో దొరికిన ఆక్సా బ్లేడ్‌తో..
ఇద్దరు దొంగల్లో ఒకడు బాతురూంకు వెళ్లాడు. అక్కడ మూడడుగుల ఆక్సా బ్లేడ్‌ దొరకడంతో దానిని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఎలాగైనా తప్పించుకోవాలని భావించిన ఇద్దరు దొంగలు అర్థరాత్రి దాటాకా ఆక్సా బ్లేడ్‌తో కాళ్లకు వేసిన గొలుసులను జాగ్రత్తగా కోసివేశారు. బేడీలకు ఉన్న లింకులను కూడా తొలగించుకున్నారు. అయితే పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది తక్కువగా ఉన్న సమయం కోసం వేచి చూసిన ఇద్దరు పోలీసులు ఎమరపాటుగా ఉన్న సమయంలో పోలీస్ స్టేషన్‌ నుంచి పరారయ్యారు. 
ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఇద్దరు దొంగలు పోలీస్‌స్టేషన్‌ నుంచి పరారైన విషయం గమనించిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. అయితే పరారైన దొంగల్లో ఒకరు ముదిగొండ పారిశ్రామిక ప్రాంతం సమీపంలోని మామిడితోటలో పోలీసులకు చిక్కాడు. మరొ దొంగ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో ఉన్న ఖైదీలు సినిమా సీన్ తరహాలో బేడీలు కట్‌ చేసుకుని పోలీస్‌ స్టేషన్‌ నుంచి పరారు కావడం ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ విషయంపై ముదిగొండ ఎస్సై తోట నాగరాజును వివరణ కోరగా ఇద్దరు దొంగలపై ముదిగొండ పరిధిలో ఎలాంటి కేసులు లేవని, వాళ్లపై ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో కేసులు ఉన్నాయని, ఏపీలో ఉన్న ద్విచక్ర వాహనాల కేసులపై ప్రస్తుతం విచారణ చేస్తున్నామని తెలిపారు.  
Also Read: Rachakonda Crime News : అరకు టు హైదరాబాద్ గంజాయి రవాణా, నలుగురు నిందితుల అరెస్టు


Also Read: Kurnool SI : "ఏయ్ కళ్లు నెత్తికెక్కాయా? నా ముందే నడుంపై చేయి వేసుకుని నిలబడతావా?"-అంగన్వాడీ నాయకురాలిపై రెచ్చిపోయిన ఎస్సై