Hijab Ban Verdict: విద్యాసంస్థల్లో హిజాబ్‌ను బ్యాన్‌ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని సంచలన తీర్పు వెలువరించింది.







2021 జనవరిలో కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని ఓ విశ్వవిద్యాలయంలో హిజాబ్ వివాదం మొదలైంది. వీటిపై దాఖలైన పిటిషన్లను కర్ణాటక చీఫ్ జస్టిస్ రీతురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎమ్ ఖాజీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ తీర్పులో కీలక పాయింట్లు చూద్దాం.


తీర్పులో కీ పాయింట్స్  



  • ఇస్లామ్ ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి మతాచారం ఏం కాదు. 

  • ఫిబ్రవరి 5న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఎలాంటి కేసు నమోదుకాలేదు.

  • విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలని చెప్పడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం కాదు. అది సహేతుకమైన పరిమితి. 

  • యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.

  • పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్. దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాలి 

  • హిజాబ్ బ్యాన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్లను సరైన రీతిలో విచారించి కొట్టివేశాం. 


నెల రోజులు


హైకోర్టు ఫుల్ బెంచ్ ఫిబ్రవరి 10న హిజాబ్ పిటిషన్‌లపై విచారణను ప్రారంభించింది. రెండు వారాల పాటు వాదనలు విన్న హైకోర్టు ఫిబ్రవరి 25వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. పాఠశాల, కళాశాల క్యాంపస్‌లలో హిజాబ్‌ను నిషేధించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.


దీనిపై ఉడిపిలోని బాలికల ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థినులు ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్లు సమర్పించారు. కౌంటర్‌లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హిజాబ్ ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని వాదించింది. ఈ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం తప్పనిసరి మతాచారం కాదని తీర్పులో తెలిపింది.



Also Read: Elon Musk Tweet: పుతిన్‌కు ఎలాన్ మస్క్ ఛాలెంజ్- దమ్ముంటే సింగిల్‌గా యుద్ధం చేయాలని ట్వీట్