అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్ నంగాల్‌ను పంజాబ్‌లోని జలంధర్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సోమవారం జలంధర్‌లోని ఒక కబడ్డీ టోర్నమెంట్‌లో ఆయన పాల్గొన్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
నలుగురు వ్యక్తులు కారులో వచ్చి మ్యాచ్ జరుగుతూ ఉండగానే అతన్ని కాల్చి చంపినట్లు జలంధర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని, పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలను వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.
టోర్నమెంట్ జరుగుతున్న ప్రదేశం నుంచి బయటకు రాగానే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తనను కాల్చారని పేర్కొన్నారు. తనపై ఎనిమిది నుంచి 10 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సంఘటన జరిగిన ప్రదేశంలో 10 బుల్లెట్ షెల్స్ దొరికాయని పోలీసులు తెలిపారు. సందీప్‌పై కాల్పులు జరగ్గానే తనని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తను మరణించాడని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.