Ysrcp on Pawan Kalyan: జనసేన ఆవిర్భావ సభలో పొత్తులపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకూడదన్నారు. అందుకోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టాలన్నారు. దీనిపై వైసీపీ నేతలు స్పందించారు. "జనసేన సైనికులారా.. తెలుగుదేశం పల్లకి మోయడానికి సిద్దంకండి! ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవ సందేశం!" అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ మళ్లీ చంద్రబాబు రాగం పాడుతున్నారన్నారు. టీడీపీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. పవన్ కు ప్యాకేజీ అందిందని, ప్యాకేజీ చర్చ అయిపోయిన తర్వాత జరిగిన సభ ఇది అని ఆరోపించారు. 






జనసేన సభలో పవన్ కామెంట్స్ 


బీజేపీ నాయకులు రోడ్డు మ్యాప్ ఇస్తామన్నారని అప్పుడే పొత్తులపై  నిర్ణయం తీసుకుంటామన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదన్నారు. వైసీపీది విధ్వంసం అయితే జనసేనది వికాసమన్నారన్నారు. 


మంత్రి పేర్ని నాని కౌంటర్ 


పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, టీడీపీని కలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనను ఇంతకు స్థాయికి తీసుకొచ్చిన సోదరుడు చిరంజీవిని ఈ సభలో ఎందుకు గుర్తుచేసుకోలేదని ప్రశ్నించారు. 2012లో పవన్ పార్టీ పెడతామంటే చంద్రబాబు వద్దన్నారు కాబట్టి పార్టీ పెట్టలేదన్నారు. 2014 పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం టీడీపీని గెలిపించడం అని అందుకు అప్పుడు పార్టీ పెట్టారని విమర్శించారు. 2024లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకు అన్ని పార్టీలను కలిపేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సభతో పవన్ ఉద్దేశం అర్థమైపోయిందన్నారు. బీజేపీ, టీడీపీ, కమ్యునిస్టు పార్టీలను కలిపి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎం జగన్ పై కక్ష్యతో పవన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మానసిక అత్యాచారం చేస్తుంది పవన్ అన్నారు. మంత్రులను కించపరిచేలా మాట్లాడిన మీరు మానసిక అత్యాచారం గురించి మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కు సొంత అజెండా లేదని ఎవరో చెప్పిన స్క్రిప్టుపై నడుస్తుతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకూ నిలకడలేని నేత పవన్ కల్యాణ్ అన్నారు. 


వైసీపీపై అసత్య ఆరోపణలు 


"ఉద్దానం వెళ్లి ఉద్దరించామన్నారు. పెద్ద కాగితాల కట్టతో చంద్రబాబు దగ్గరకు వెళ్లారు. చంద్రబాబు, పవన్ ఉద్దానాన్ని ఏం ఉద్దరించారు.  ర్యాంబో రాంబాబు అని మానసిక అత్యాచారం చేయొచ్చు. మీరు ఏది పడితే అది మాట్లాడతారు. ఇదేం ఆనందం పవన్ కల్యాణ్. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పోరాటానికి వైసీపీ ఊతం ఇచ్చింది. గబగబా వచ్చి పెరుగన్నం తినేసి వెళ్లి చంద్రబాబు అన్ని బాగాచేస్తున్నారు అన్నారు. బెజవాడను కుల రాజధాని అన్నారు. కర్నూలు వెళ్లి అక్కడ జనసేన మనసులో రాజధాని కర్నూలు అన్నారు. ఎవరో రాసిచ్చిన డైలాగ్స్ మాట్లాడి వెళ్లిపోయారు. లక్షల పుస్తకాలు చదివిన పవన్ ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు. వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పడం సరికాదు. మీకు లెక్కలు తెలియదా? కరోనా సమయంలో ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎంత కష్టపడిందో మీకు తెలియదా?. పవన్ ఇప్పటికైనా తెలుసుకుని మాట్లాడాలి." అని పేర్ని నాని అన్నారు.