యూరోపియన్ యూనియన్ తో కొనసాగలనకుంటున్న యుక్రెయిన్ తన ఆలోచనను మార్చుకునేంతవరకూ యుద్ధాన్ని ఆపేది లేదని రష్యా తేల్చి చెప్తోంది. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ భూభాగంలోకి దూసుకువస్తున్న రష్యన్ సేనలను గుర్తించటమూ ఉక్రెయిన్ సైన్యానికి కష్టమవుతోంది. ఇదే సమయంలో రష్యాలో ఓ ఆంగ్ల అక్షరం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రష్యన్ సేనలు, రష్యా మద్దతుదారులు, పుతిన్ కు అండగా నిలబడుతున్నవారు అందరూ ఆ అక్షరాన్నే వాడటం ఇప్పుడు అన్ని చోట్లా కనిపిస్తోంది.


Z అనే ఈ అక్షరం గురించే ఇప్పుడు చర్చంతా. యుక్రెయిన్‌పై రష్యా దాడికి మద్దతు చిహ్నంగా ఆంగ్ల అక్షరం 'z'ను రష్యాలో వాడుతున్నారు. రష్యా రాజకీయ నాయకులు కూడా దీనికి ప్రచారం కల్పిస్తున్నారు. యుద్ధట్యాంకర్లు, మిలట్రీ వాహనాలు, ఆర్మీ యూనిఫాంతో మొదలు పెట్టి సాధారణ రష్యన్ల కార్లు, వ్యాన్లు, బస్ షెల్టర్లు, నివాసాలు, టీ షర్టులు, మీమ్స్ పై ఈ చిహ్నం కనబడుతోంది. హోర్డింగ్‌లు కూడా వెలిశాయి రష్యాలో.


Z అనే అక్షరం సామాజిక మాధ్యమాల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఈ అక్షరాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు రష్యన్లంటే దానిపైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. స్థూలంగా చూస్తే మాత్రం...Z అనే అక్షరాన్ని  ప్రపంచ పటంలో రష్యా విస్తృతి ఎలా ఉందో, ఎలా ఉంటుందో చూపిస్తుందనేది అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం.


సులభమైన అంశాలకు ప్రచారం కల్పిస్తే వాటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. కళాత్మక కోణంలో చూసినా ఓ  శక్తిమంతమైన చిహ్నంలా ప్రజలకు చేరువతాయి ఇలాంటి సింబల్స్. రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడికి మద్దతు ఇచ్చే వారందరినీ ఒకదరికి చేరడానికి ఈ చిహ్నానికి కేవలం రెండు వారాల కంటే తక్కువ సమయమే పట్టిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


'z' చిహ్నానికి అనేక వివరణలు వ్యాప్తిలో ఉన్నాయి. 'z' అక్షరం ఉన్న రష్యా యుద్ధ ట్యాంకులు యుక్రెయిన్ వైపు బయలుదేరిన తర్వాత తొలిసారిగా ఈ చిహ్నం సామాజిక మాధ్యమాల దృష్టిని ఆకర్షించింది. ప్రారంభంలో 'z' అక్షరాన్ని '2' అని అనుకున్నారు. ఫిబ్రవరి 22వ తేదీకి సూచకంగా దీన్ని తీసుకున్నట్లు భావించారు. 2022 ఫిబ్రవరి 22వ తేదీనే... తూర్పు యుక్రెయిన్‌ రీజియన్‌లోని దోన్యస్క్, లూహాన్స్స్ ప్రాంతాలతో స్నేహం, సహకారం, ఉమ్మడి సహాయం తదితర అంశాలపై రష్యా అమోదముద్ర వేసింది.


కానీ ఇప్పుడు అందరూ యుద్ధంలో పాల్గొనే తమ సొంత బలగాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా రష్యా ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. 'z' అనేది రష్యా మిలిటరీ సామగ్రికి సాధారణ గుర్తు అని రష్యన్ ఆర్మీ చెబుతోంది.


'ఫ్రెండ్లీ ఫైర్'ను నివారించడానికి, స్వీయ సైనికుల గుర్తింపులో రష్యా బలగాలు పొరబడకుండా ఉండేందుకే ఈ చిహ్నాన్ని వాడుతున్నట్లు మరికొంతమంది విశ్లేషకుల వాదన. 


అయితే నియంతృత్వానికి ప్రతీకగా ఆ చిహ్నాన్ని భావించనవసరం లేదని మరికొంత మంది విశ్లేషకులు చెబుతున్న మాట. దీనికో రీజన్ ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని భయపెట్టిన సింబల్ స్వస్తిక్. ఎందుకంటే ఆ గుర్తును హిట్లర్, నాజీ సైనికులు గౌరవంగా భావించే వారు. ఆ గుర్తుతో మనిషి తమ వైపు వస్తున్నాడంటే చాలా ప్రాణాలు పోతాయనేంతగా జర్మనీలో పరిస్థితి ఉండేది. ఇక యూదుల సంగతి సరే సరి...ప్రాణాలు దక్కించుకోవాలని ప్రయత్నించినా హోలోకాస్ట్ లాంటి దురాగతాలకు బలైపోయారు. అయితే Z ను అలా మోనార్కీకి సింబాలిజం లా చూడాల్సిన పని లేదనేది రష్యన్ల విశ్లేషకుల వివరణ. ఎందుకంటే 'z' ఫొటోలతో పాటు 'v' అనే అక్షరం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. రష్యా రక్షణ శాఖ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పోస్టుల్లో నూ ఈ z, v కనిపిస్తున్నాయి. 


కొన్ని చోట్ల చిహ్నాలతో పాటు 'జా పత్సనోవ్ (సహచరుల కోసం)', 'సిలా వి ప్రవేడ్ (సత్యమే శక్తి)' అనే వ్యాఖ్యలను కూడా జోడిస్తున్నారు. వోస్తోక్ (తూర్పు), జాపడ్ (పడమర) అనే పదాలకు సూచికగా ఈ రెండు లాటిన్ అక్షరాలను ఎంచుకొని ఉంటారనే భావన కూడా ఉంది. 'z' అక్షరం రష్యా తూర్పు బలగాలను, 'v' చిహ్నం నావికా దళాలను సూచిస్తుందని యుక్రెయిన్ సైన్యం నమ్ముతున్నట్లు సామాజిక మాధ్యమాలు సూచిస్తున్నాయి.


ఇదంతా ఇలా ఉంటే ఖతర్‌లో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో రష్యన్ జిమ్నాస్ట్ ఇవాన్ కులియాక్‌పై అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య (ఎఫ్ఐజీ) క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. పోటీల అనంతరం మెడల్ ప్రదానోత్సవ కార్యక్రమంలో పోడియంపై తన యుక్రెయిన్ ప్రత్యర్థి పక్కనే నిలబడిన ఇవాన్ కులియాక్ టీషర్ట్‌పై ఆంగ్ల అక్షరం 'Z' ఉండడంతో ఎఫ్ఐజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇదీ పుతిన్ సపోర్టింగ్ రష్యన్లు, ఆ ఆర్మీ విరివిగా వాడుతున్న Z సింబల్ వెనుక ఉన్న కథ.