రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా, యూరోప్ యూనియన్, నాటో దళాలు నిలబడుతున్నాయి. భూమిపైన జరుగుతున్న ఈ యుద్ధం తర్వాతి లక్ష్యం ఆకాశమా అన్న అనుమానాలు ఇటీవలి కాలంలో బలపడుతున్నాయి. ఎందుకంటే భూవాతావరణం దాటి గగన తలంలో తేలుతూ అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రంగా పని చేస్తున్న ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ చుట్టూ ఇప్పుడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.


రష్యాపై ఆంక్షలు


ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ ఆంక్షల ప్రభావం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూలిపోవడానికి కారణమవ్వచ్చని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ రోగోజిన్ తాజాగా మరోసారి హెచ్చరించారు.


దిమిత్రి రోగోజిన్ ఏం మాట్లాడారో తెలుసుకునే ముందు...అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏంటీ...తెలియని వాళ్ల కోసం కొంచెం మాట్లాడుకుందాం.


స్పేస్‌ రీసెర్చ్ సెంటర్


భూమి నుంచి సుమారు 408 కిలోమీటర్ల ఎత్తులో.. అంటే ఆకాశంలో ఇంటర్ నేషనల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది.  అదొక కొలాబరేటివ్ ఫెసిలిటీ. అమెరికా, రష్యా సహా మొత్తం 15 దేశాలు కలిసి ఈ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ ను మెయిన్ టైన్ చేస్తున్నాయి.


అంతరిక్షంలో పరిశోధనలు


అసలెందుకు ఈ స్పేస్ రీసెర్చ్ స్టేషన్ అంటే...భూమి పై నుంచి అనేక దేశాలు అంతరిక్ష ప్రయోగాలను చేస్తున్నాయి. చంద్రుడి మీదకు, మార్స్ మీదకు భవిష్యత్తులో వెళ్లి అక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోవాలనేది చాలా స్పేస్ ఏజెన్సీలకు ఎప్పటి నుంచో ఉన్న ప్లాన్. అందులో భాగంగా ప్రతీసారి భూమి పై నుంచి వెళ్లే కంటే....భూమి వాతావరణాన్ని దాటాక ఓ హాల్ట్ పాయింట్ లాంటిది ఉంటే అక్కడి నుంచి ప్రయాణాలు సాగించటం సులువు అవుతుందని చాలా దేశాలు భావించాయి. అంతే కాదు భూమిపై జరుగుతున్న మార్పులను గమనించేందుకు....ఇంకా శాస్త్రవిజ్ఞానికి సంబంధించి అనేకానేక ప్రయోగాలు చేసేందుకు ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఓ వేదిక.


తొమ్మిది స్టేషన్లు


గతంలో అమెరికా, రష్యా లాంటి దేశాలు తమ కోసం విడివిడిగా స్పేస్ స్టేషన్ల లాంటి ప్రయోగాలు చేశాయి. రష్యా స్పేస్ స్టేషన్లు శాల్యూట్, ఆల్మాజ్, మిర్ లాంటివి అవే. అమెరికా కూడా స్క్రైలాబ్ లాంటి ప్రయోగాలు చేసింది. ఆ తర్వాత అన్ని దేశాలు కలిసి ఓ ఒప్పందానికి రావాలాని నిర్ణయించుకుని ఇప్పుడున్న తొమ్మిదవ స్పేస్ స్టేషన్ ను అసెంబుల్ చేశాయి. దానికే ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ అని పేరు పెట్టాయి. అలా 1998 నవంబర్ 20న అంటే 23 ఏళ్ల ముందు ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ సిద్దమైంది.


రెండు భాగాలుగా అంతరిక్షం


ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటి రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్...మరొకటి యునైటెడ్ ఆర్బిటల్ సెగ్మెంట్ . రష్యన్ సెగ్మెంట్ లో మొత్తం ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. యూఎస్ సెగ్మెంట్ లో పది మాడ్యూల్స్ ఉంటాయి. యూఎస్ సెగ్మెంట్ లో నాసా కి 76 శాతం సపోర్ట్ సర్వీసెస్ వాటా ఉంటే....జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా కీ 12.8 శాతం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి 8.3 శాతం, కెనడియన్ స్పెస్ ఏజెన్సీ కి 2.3 శాతం వాటా ఉంది.


రష్యాకి ఆరు మాడ్యూల్స్‌


మరి ఇక్కడే ఉండి ప్రయోగాలు చేసే ఆస్ట్రోనాట్లు నివసించేందుకు ఐఎస్ఎస్ లో మొత్తం 16 హ్యాబిటబుల్ మాడ్యూల్స్ ఉంటాయి. వీటిలో అమెరికావి 8 అయితే...రష్యా వి 6. ఒకటి జపాన్ ది ఇంకోటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది. ప్రస్తుతం ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లో నలుగురు అమెరికన్ ఆస్ట్రోనాట్లు, ఇద్దరు రష్యన్ కాస్మోనాట్లు, ఓ యూరోపియన్ అస్ట్రోనాట్ ఉన్నారు.


సరే ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వద్దాం. ఈ యుద్ధం ప్రారంభం కాకముందే 2024 వరకే ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కి రష్యా సహకారం ఉంటుందని పుతిన్ ప్రకటించారు. కారణం రష్యా తనకంటూ ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవటమే.


డేంజర్‌ స్పేస్‌ గార్బెజ్


ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ లో రష్యా కీలకం ఎందుకంటే....డేంజరస్ స్పేస్ గార్బెజ్ నుంచి ఐఎస్ఎస్ ను కాపాడుతోంది రష్యానే. ప్రపంచంలోనే పెద్ద దేశం రష్యా కావటంతో తన దేశ ఉపరితలం పైనుంచి ఐఎస్ఎస్ వెళ్తునప్పుడల్లా  కక్ష్యను సరిదిద్దే పనులను చేస్తోంది రష్యానే. సో రష్యా సహకారం లేకపోతే 500 టన్నుల ఐఎస్ఎస్ ఇండియా మీదో చైనా మీదో కూలిపోతుందని గతంలో కూడా రష్యన్ స్పేస్ ఏజెన్సీ- రోస్ కాస్మోస్ డైరెక్టర్ దిమిత్రీ రోగోజిన్ గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు.


ఐఎస్ఎస్‌లో అంతరిక్ష వ్యర్థాలు సహా కక్ష్యను ఏడాది సగటున 11సార్లు రష్యా విభాగం సరిదిద్దుతోంది అని మళ్లీ ఓ మ్యాప్ ను రిలీజ్ చేశారు దిమిత్రీ రోగోజిన్. అంతేకాదు, ఐఎస్ఎస్ ఏ ప్రాంతంలో కూలిపోయే ప్రమాదం ఉందో తెలియజేసే మ్యాప్‌ను కూడా పబ్లిష్ చేశారు. ఐఎస్ఎస్ నుంచి రష్యన్లు వేరు అయిపోతున్నట్లు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు రోగోజిన్. రష్యన్ స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ ఇలాంటి ట్వీట్లు చేయటం....వీడియోలు పెట్టడం ప్రపంచదేశాలు బెదిరించటమే అని ఉక్రెయిన్ మద్దతు దేశాలు అన్నీ రష్యన్ స్పేస్ ఏజెన్సీ చర్యలను ఖండిస్తున్నాయి.