కెనడాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందారు. ఒంటారియో హైవేపై టొరొంటో వద్ద ఓ పాసింజర్ వ్యాన్‌ను ట్రాలీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఏడుగురు భారత విద్యార్థులు ఓ వ్యాన్‌లో ప్రయాణం చేస్తుండగా ఓ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భారత విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రాలీ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ విషయాన్ని కెనడాలో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారికి కెనడాలోని భారత రాయబార కార్యాలయం అన్నివిధాల అండగా ఉందన్నారు.
మృతులు వీరే
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని హర్‌ప్రీత్ సింగ్ (24), జస్పిందర్ సింగ్ (21), కరణ్‌పాల్ సింగ్ (22), మోహిత్ చౌహాన్ (23), పవన్ కుమార్ (23)గా క్వింటే వెస్ట్ ఒంటారియో ప్రొవీన్స్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దిగ్భ్రాంతి
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయ్‌శంకర్ స్పందించారు. ఐదుగురు భారత విద్యార్థులు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు భారత్ అండగా ఉంటుందన్నారు.
Also Read: Pak No Confidence Motion: ఆలూ, టమాటా ధరలు తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్