ఉక్రెయిన్‌లోని సైనిక శిక్షణ స్వావరంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 35 మంది మృతి చెందారు. మరో 134 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ (NATO) సభ్య దేశమైన పోలాండ్ సరిహద్దు దగ్గర్లో ఈ దాడి జరిగింది.
రష్యా సేనల తాజా దాడిలో అక్కడ ఉన్న లుట్స్క్ ఎయిర్ పోర్టు బాగా దెబ్బతింది. ఇది పొలాండ్ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఇక్కడ ఇవనోవ్ ఫ్రాంకోవిస్క్ మిలటరీ ఎయిర్‌బేస్‌పై క్షిపణులతో దాడులు చేశారు. ఉక్రెయిన్‌లోనే అతిపెద్ద సైనిక శిక్షణ కేంద్రాల్లో ఒకటి ల్వీవ్‌లో ఉంది.
కార్యాలయం తరలింపు
ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పొలాండ్‌కు తరలించారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.
రష్యా హెచ్చరిక
ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్న దేశాలకు రష్యా శనివారం ఓ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దేశాలు అక్కడకు ఆయుధాలు పంపిస్తే ఆ వాహన శ్రేణులు తమకు లక్ష్యాలుగా మారుతాయని రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గే ర్యాబ్‌కోవ్ శనివారం ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ప్రమాదకరమైన చర్య అని అమెరికా సహా అనేక దేశాలను ఇప్పటికే హెచ్చరించామని చెప్పారు.తమ హెచ్చరికల్ని అమెరికా తీవ్రంగా పరిగణించలేదన్నారు.