40 అంతస్తుల ట్విన్ టవర్స్.. 4 టన్నుల మందుగుండు.. కేవలం 9 సెకన్లలో నేలమట్టం! అవును ఇది నిజమే. నోయిడాలో ఉన్న సూపర్‌టెక్‌ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్‌ కోర్ట్‌ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను కేవలం 9 సెకన్లలో నేలమట్టం చేస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఈ భవనాలను మే 22 నాటికి కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీం కోర్టుకు ఇటీవల తెలియజేసింది.







4 టన్నుల మందుగుండు


సుమారు 4 టన్నుల మందు గుండు సహాయంతో కేవలం 9 సెకన్లలో ట్విన్‌ టవర్స్‌ను నేలమట్టం చేస్తామని అధికారులు తెలిపారు. సుప్రీం కోర్టులో చెప్పినట్లే కూల్చివేత పనులు జరుగుతాయని వారు తెలిపారు. మే 22న మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో  ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేస్తామని వెల్లడించారు.


తరలింపు


అయితే కూల్చివేత సమయంలో టవర్స్‌కు సమీపంలోని సెక్టార్-93Aలో నివసిస్తోన్న సుమారు 1,500 కుటుంబాలను ఐదు గంటల పాటు వారి ఇళ్ల నుంచి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా సైట్‌కు దగ్గరగా ఉన్న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేను కూడా గంట పాటు మూసేస్తామన్నారు. కూల్చివేతకు అయ్యే ఖర్చులను పూర్తిగా మొత్తం బిల్డర్‌ భరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 


చెల్లించాల్సిందే


ట్విన్‌ టవర్స్‌ నిర్మాణానికి అక్రమ అనుమతులు ఇచ్చిన నోయిడా అధికారులను విచారించాలని కోర్టు తన తీర్పులో తెలిపింది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. ఇక రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్‌ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.


Also Read: Modi on Kashmir Files: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ కీలక వ్యాఖ్యలు- ఏమన్నారో తెలుసా?


Also Read: Hijab Ban Verdict: చదువుకోండి ఫస్ట్- మిమ్మల్ని స్కూల్‌కు పంపేది చదువుకోవడానికి: భాజపా