ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా మెడిసిన్ విద్యను మధ్యలో వదిలేసి వచ్చిన వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ ( TS CM KCR ) భరోసా ఇచ్చారు. వారిని తీసుకొచ్చామని.. కానీ వారి చదువుల పరిస్థితేమిటని అసెంబ్లీలో ( Assembly ) కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఎంత ఖర్చయినా వారి మెడిసిన్ పూర్తయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ వైద్య కళాశాల్లో ఇండియాకు సంబంధించిన  దాదాపుగా పద్దెనిమిది వేల మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారు. వారందర్నీ యుద్ధం కారణంగా వెనక్కి తీసుకొచ్చేశారు. అటూ ఇటూగా ఏడు వందల మందికిపైగానే తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉంటారని అంచనా వేస్తున్నారు. వారందరి విద్య పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది. 


దేశంలో వారికి ప్రత్యేకంగా వైద్య విద్య అందించడం సాధ్యం కాదు. ఇక్కడ నీట్ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులైన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయి. ఉక్రెయిన్‌లో వైద్య విద్య పూర్తి చేసి ఉంటే ఇక్కడ అర్హతా పరీక్ష పెట్టేవారు. కానీ విద్యార్థులు ఒకటి నుంచి ఆరో ఏడాది వరకూ వివిధ స్థాయిల్లో ఉన్నారు. అందుకే తమకు కూడా వైద్య  విద్య కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వారి తరపున సుప్రీం కోర్ట్ లో ( Supreme Court ) ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. న్యాయవాది రాణా సందీప్ బుస్సా సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. రాజ్యాంగంలో అధికరణ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్ట్ ని కోరారు. భారత్ లోనే చదువు కొనసాగించాలని కోరుతూ పిల్ దాఖలు చేసింది.  ఇదే విజ్ఞప్తితో ప్రవాసీ లీగల్ సెల్ ( Pravasi legal Cell ) కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 
 
ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరంతా ఆర్థికంగా నష్టపోవడంతోపాటు, తమ చదువు కొనసాగడంపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  ప్రతిపక్షాలు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం ( Central Governament )  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఈ క్రమంలో కేసీఆర్ తొలి సారిగా ఎంత ఖర్చు అయినా వారి మెడిసిన్ పూర్తి అయ్యేలా సహకరిస్తామన్నారు. అయితే మెడికల్ విద్య రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదు. కేంద్రం  చేతుల్లో ఉంటుంది. ఉక్రెయిన్ నుంచి రిటర్న్ అయిన విద్యార్థులకు కేసీఆర్ ఎలాంటి సాయం చేయగలరో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.