AP Assembly: ఏపీ అసెంబ్లీని వదలని జంగారెడ్డి గూడెం ఘటన, మిగిలిన టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఎవరు ఎన్ని క్లారిటీ ఇచ్చిన టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సభను స్తంభింపజేస్తున్నారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి గందరగోళం సృష్టిస్తున్నారని స్పీకర్ సస్పెండ్ చేస్తున్నారు.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ కూడా జంగారెడ్డి గూడెం ఘటన కాకరేపింది. కల్తీ సారా తాగి జనాలు చనిపోతుంటే ప్రభుత్వం తప్పుడు వివరణ ఇస్తోందని మండిపడింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. దీనిపై సమగ్రమైన చర్చకు పట్టుబట్టింది. దీనిపై నిన్నే క్లారిటీ ఇచ్చిందుకు మళ్లీ చర్చ కుదరదని తేల్చి చెప్పేసింది.

Continues below advertisement

ప్రభుత్వ వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టింది. జంగారెడ్డి గూడెం ఘటనపై చర్చ జరపాలని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఆధారం కోల్పోయిన ఫ్యామిలికీ ప్రభుత్వం భారీ నష్టపరిహారం అందివ్వాలని నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆందోళనలు కొనసాగాయి. 

ఈ ఆందోళనల మధ్య సీఎం జోక్యం చేసుకొని... లేని సమస్యను ఉన్నట్టు చూపించి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన అసెంబ్లీ ప్రజా సమస్యలు చర్చకు రాకుండా జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందన్నారు. అసలు టైట్‌ సెక్యూరిటీ, నిఘా ఉన్న ప్రాంతంలో సారా ఎలా కాస్తారని ప్రశ్నించారు జగన్. 55వేల జనాభా ఉన్న ప్రాంతం అది సాధ్యమయ్యే పనేనా అంటూ నిలదీశారు జగన్. 

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నామని... కల్తీ సారాపై ఉక్కుపాదం మోపుతామన్నారు సీఎం జగన్. ప్రభుత్వంపై ప్రతిపక్షం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు జగన్. సభలో హుందాగా ప్రవర్తించాలని టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. 

సీఎం జగన్ చెప్పినప్పటికీ టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు.  స్పీకర్ పోడియం నుంచి వెనక్కి రాలేదు. దీంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్టు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సస్పెండ్ అయిన టీడీపీకి చెందిన 11 మంది సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. 

ఇదే ఘటనపై సోమవారం ఐదుగురు సభ్యులు సస్పెండ్ అయ్యారు. వాళ్లను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. 

ఈ సస్పెన్షన్‌లపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజల తరఫున గళం వినిపిస్తున్న టీడీపీ గొెంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. జంగారెడ్డి గూడెం ఘటనను తొక్కిపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందున్నారు టీడీపీ సభ్యులు. 

Continues below advertisement