కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తామని మోదీ సర్కార్ ప్రకటించినప్పటికీ రైతులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై సింఘు సరిహద్దులో చర్చించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్) తమ తదుపరి కార్యాచరణను వెల్లడించింది. నవంబర్ 29న పార్లమెంటు వరకు కవాతు చేయనున్నట్లు ప్రకటించింది. 


సాగు చట్టాలను రద్దు చేస్తున్నప్పటికీ ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు తమ కార్యాచరణను యథావిధిగా కొనసాగిస్తామని ఎస్‌కేఎమ్ ప్రకటించింది.


కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై చట్టం రూపకల్పన, లఖింపుర్ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా బర్తరఫ్, అరెస్ట్ సహా మొత్తం ఆరు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు రైతులు. 


కార్యాచరణ..


1) ఇప్పటికే ప్రకటించిన అన్ని కార్యక్రమాలను చేపట్టనుంది ఎస్‌కేఎమ్. నవంబర్ 27న మరోసారి రైతుల భేటీ జరగనుంది.  


2) లఖ్‌నవూలో నేడు జరగనున్న కిసాన్ మహాపంచాయత్‌లో పాల్గొనాలని పౌరులకు రైతులు పిలుపునిచ్చారు. 


3) నవంబర్ 24న చోటు రామ్ పుట్టినరోజును కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ దివస్‌గా ఎస్‌కేఎమ్ ప్రకటించింది. 


4) నవంబర్ 26న 'దిల్లీ బోర్డర్ మోర్చే పే చలో' అనే కార్యక్రమాన్ని జరపనుంది. 


5) నవంబర్ 27న జరగనున్న భేటీలో తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది ఎస్‌కేఎమ్.


నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకునేలా పట్టువదలకుండా రైతులు చేసిన పోరాటంపై ఎస్‌కేఎమ్ హర్షం వ్యక్తం చేసింది. ఇది చారిత్రక విజయంగా అభివర్ణించింది.


నవంబర్ 24న మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకునే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం పలికే అవకాశం ఉంది. 


నవంబర్ 29 నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకునే బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.


Also Read: Abhinandan Awarded Vir Chakra: పాక్‌ను వణికించిన కమాండర్ అభినందన్‌కు 'వీర చక్ర'