అధికరక్తపోటు ఒక్కసారి వచ్చిందా... జీవితాంతం వేధిస్తుంది. ఉప్పు తక్కువగా తినాలి, చక్కెర పదార్థాలు కూడా తగ్గించాలి. లేకుంటే జతగా డయాబెటిస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు కొత్త అధ్యయనం హైబీపీ ఉన్నవాళ్లకి మరో షాకింగ్ వార్తను మోసుకొచ్చింది. దీనివల్ల ఎప్పుడైనా మూర్ఛ వ్యాధి ఎటాక్ అయ్యే అవకాశం రెండున్నర రెట్లు ఎక్కువని తేల్చింది. ‘ఎపిలెప్సియా’ అనే అమెరికన్ జర్నల్ లో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. దాదాపు 2,986 మంది అమెరికన్లపై ఈ పరిశోధన సాగింది.
ఇందుకోసం హైబీపీతో బాధపడుతున్న యాభై ఎనిమిదేళ్ల వయసున్న వారిపై ఈ అధ్యయనం సాగింది. మొత్తం 2,986 మందిని 19 ఏళ్ల పాటూ గమనించారు. వారిలో 55 మందిలో మూర్ఛ లక్షణాలు కనిపించాయి. దీన్ని బట్టి హైబీపీ ఉన్నవారికి ఎపిలెప్సీ వచ్చే అవకాశం ఉందని తేలింది. ఈ అధ్యయనాన్ని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించారు. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన మరియా స్టెఫనిడౌ వివరించారు.
‘ఈ అధ్యయనం కేవలం రోగాల మధ్య అనుబంధాన్ని మాత్రమే చెబుతుంది. కారణాన్ని చెప్పదు. కారణాలు తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనం అవసరం’ అని విరిస్తున్నారు పరిశోధకులు. అంటే హైబీపీ వల్ల మూర్ఛ వస్తుందని మాత్రమే ఈ అధ్యయనం తేల్చింది. కానీ హైబీపీ ఉన్న వాళ్లకి మూర్ఛ ఎందుకు వస్తుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు, నిద్రపోకూడదా? ఈ నమ్మకాల గురించి సైన్స్ ఏం చెబుతోంది?