ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే వీగన్ డైట్ లో ముఖ్యమైనవి అవిసె గింజలు. ఇవి శరీరంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. తద్వారా డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి బరువు పెరిగే సమస్య ఉండదు. ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేసి, ఆకలి వేయకుండా చేస్తుంది. దీని వల్ల ఎక్కువ ఆహారం పొట్టలోకి చేరదు. తద్వారా కూడా బరువు పెరగరు. కీళ్ల వాతం, ఉబ్బసం, క్యాన్సర్ల నుంచి కూడా అవిసె గింజలు కాపాడగలవు. మీరు చేయాల్సిందల్లా అవిసెగింజల్ని రోజువారీ ఆహారం భాగం చేసుకోవడమే. చాలా మందికి అవిసెగింజల్ని ఏ రూపంలో తినాలో తెలియదు. వారికి కొన్ని ఐడియాలు ఇవిగో...


1. అవిసె గింజల లడ్డూ
పల్లీలు (100 గ్రాములు), నువ్వులు (50 గ్రాములు), అవిసె గింజలు (200 గ్రాములు) మూడింటిని విడివిడిగా వేయించుకోవాలి. పల్లీల మీద పొట్టును తీసేయాలి. ఈ మూడింటిని మిక్సీలో పొడి కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నని బాణలిలో బెల్లం వేసి పాకం తీయాలి. ఆ పాకంలో ముందుగా చేసిపెట్టుకున్న పొడిని వేసి బాగా కలపాలి. యాలకుల పొడి, కాస్త నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. చల్లారాక వాటిని ఉండల్లా చుట్టుకోవాలి. రోజుకో లడ్డూ తింటే చాలా మంచిది. 


2. అవిసె మొలకలు
అవిసె గింజల్ని రాత్రంతా నీటిలో నానబెడితే ఉదయానికి మొలకలు వస్తాయి. ఇలా రోజూ మొలకలు వచ్చిన గుప్పెడు అవిసె గింజల్ని తింటే ఎంతో ఆరోగ్యం. 


3. అవిసె డ్రింక్
గుప్పెడు అవిసెగింజల్ని నీటిలో నానబెట్టాలి. ఏడుగంటల అలా నానబెట్టాక ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ నీటిలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. 


4. మునగాకు అవిసెగింజల పొడి
అవిసె గింజలు, మునగాకును విడివిడిగా వేయించాలి. అవి కరకరలాడే వరకు వేయించాలి. చిన్న మంటపై కళాయి వేడిచేసి ఒక చెంచా ఆయిల్ వేయాలి. అందులో పసుపు, కారం వేసి వేయించాలి. చల్లారక ఆ నూనెలో అవిసెగింజలు, మునగాకు, వెల్లుల్లి, పుట్నాల పప్పు, కారం, ఉప్పు అన్నీ వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడితో రోజూ ఒక అన్నం ముద్ద తింటే చాలా మంచిది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
Read Also: ఆరోగ్యాన్ని వేయించుకుని తినేయకండి... వేపుడు వంటకాలతో వచ్చే రోగాలు ఇవే
Read Also: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?
Read Also: పాలు, అరటిపండు ఒకేసారి తినకూడదా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి