Rakesh Tikait: రాకేశ్ టికాయత్.. అలుపెరుగని యోధుడు.. అన్నదాతను నడిపించిన నాయకుడు!

ABP Desam Updated at: 19 Nov 2021 11:13 AM (IST)
Edited By: Murali Krishna

రాకేశ్ టికాయత్.. ప్రస్తుతం ఈ పేరు దేశంలో మార్మోగుతోంది. ఇందుకు కారణం ఈ పోరాటంలో ఆయన చూపించిన తెగువ. అసలు ఎవరీ రాకేశ్ టికాయత్?

రాకేశ్ టికాయత్.. ఓ పోరాట యోధుడు

NEXT PREV


మా ఆందోళన విరమించం. పార్లమెంటులో సాగు చట్టాలను రద్దు చేసే రోజు వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. అలానే ప్రభుత్వం ఎంఎస్‌పీ కాకుండా మిగిలిన రైతు సమస్యలపై కూడా మాట్లాడాలి.                                            -  రాకేశ్ టికాయత్, బీకేయూ నేత


ఇది నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించిన తర్వాత భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ స్పందన. ఉద్యమం మొదలైన నాటి నుంచి నేటి వరకు రాకేశ్ టికాయత్ తీరు ఇదే. ఎంతో పరిణితితో, తెగువతో, ధైర్యంతో రైతుల ఉద్యమాన్ని ఆయన మలిచారు. ఒకానొక సమయంలో రైతులు దేశ ద్రోహులు అని మోదీ సర్కార్‌లోని పెద్దలే మాట్లాడినా.. ఆ విమర్శలను కూడా అదే రీతిలో తిప్పికొట్టారు. మరి అలాంటి రాకేశ్ టికాయత్ గురించి ఈ వివరాలు మీకు తెలుసా?


ఎవరీ టికాయత్...


రాకేశ్‌ టికాయిత్..‌ రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాల్లో ఒకరైన బీకేయూ నేత. మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దుచేయాలంటున్న రైతుల వాణిని కేంద్రానికి వినిపించిన నేత. యూపీకి చెందిన ఆయన‌.. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించగలరని అనేకమంది రైతులు గట్టిగా విశ్వసించారు. ఇందుకు ఆయన నేపథ్యం కూడా ఒక కారణం.


తండ్రి కూడా..


రాకేశ్‌ టికాయిత్‌ 1969, జూన్‌ 4న యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లా సిసౌలీ గ్రామంలో జన్మించారు. మీరట్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. ఎల్‌ఎల్‌బీ కూడా పూర్తి చేశారు. రాకేశ్‌ తండ్రి మహేంద్రసింగ్‌ టికాయిత్‌ కూడా ఓ పెద్ద రైతు నాయకుడే. 90ల్లో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా లక్షలాది మందితో దిల్లీ ముట్టడి కార్యక్రమానికి ఆయన నాయకత్వం వహించారు. రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరాటాన్ని ముందుకు నడిపించడంలో మహేంద్ర సింగ్‌ కీలక పాత్ర పోషించారు. రైతు ఉద్యమంలోకి రావడానికి ముందు రాకేశ్‌ ఎస్సైగా పనిచేసేవారు. 1992లో దిల్లీ పోలీస్‌ విభాగంలో ఆయన చేరారు. అయితే, ఆయన తండ్రి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో రాకేశ్‌పై రాజకీయపరమైన ఒత్తిడి వచ్చింది. తండ్రిని ఒప్పించి రైతు పోరాటాన్ని నిలిపివేయాలన్న ఒత్తిడి రావడంతో తన ఉద్యోగాన్ని వదులుకొన్నారు.


నడిపించిన నాయకుడు..


ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతు పోరాటంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) ఒకటి. ఈ సంఘానికి జాతీయ అధికార ప్రతినిధిగా రాకేశ్‌ టికాయిత్‌ కొనసాగుతున్నారు. ఆయన పెద్ద అన్నయ్య నరేశ్‌ టికాయిత్‌ బీకేయూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాకేశ్‌ టికాయిత్‌ రెండుసార్లు ఎన్నికల్లో పోటీచేసినా కలిసి రాలేదు.


2007లో ముజఫర్‌నగర్‌లోని ఖటౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో అమ్రోహ నుంచి లోక్‌సభకు ఆర్‌ఎల్డీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన ఈ ఉద్యమాన్ని గెలుపు దిశగా నడిపించిన తీరు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.


Also Read: Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన


Also Read: Farm Laws: జై కిసాన్.. ఏం చేస్తిరి.. ఏం పోరాటం చేస్తిరి.. అన్నదాత నీకు 'దేశం' సలాం


Also Read: 3 Farm Laws Repealed: మోదీ తలవంచారా? ఇది ఎన్నికల వ్యూహమా? రైతుల విజయమా?

Published at: 19 Nov 2021 10:31 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.