నరేంద్ర మోదీ.. ఆయన ఒక్కడగు వేస్తే వెనుకంజ వేయరనే ఏడేళ్లుగా భారత దేశ ప్రజలు భావించారు. కానీ ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం జరిపిన రైతుల ఆందోళనకు ఆయన తలొగ్గారు. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. అయితే ఇది రైతుల విజయమా..? రానున్న ఎన్నికలకు ముందస్తు వ్యూహమా..? అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.


700 మంది..


నూతన సాగు చట్టాలపై రైతులు చేసిన ఈ పోరాటంలో దాదాపు 700 మంది వరకు అసువులు బాశారు.. దేశమంతా మేము రైతుల వెంటే ఉంటామని సోషల్‌ మీడియా వేదికగా తమ మద్దతును తెలిపారు. ప్రతిపక్షాలు, వామపక్షాలు రైతుల వెంట నిలిచాయి. చివరికి ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న అకాళీదళ్‌ సైతం ఎన్‌డీఏకు మద్దతు ఉపసంహరించుకోవడంతోపాటు కేంద్రమంత్రిగా ఉన్న హరిసిమ్రత్‌ బాదల్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినా ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎన్నడూ లేనంతగా దిల్లీ సరిహద్దులను అష్ట దిగ్బంధనం చేసి, చివరకు రోడ్లపై మొలలు కొట్టినా, రైతులపై లాఠీలు విరిగినా వెనుకంజ వేయకుండా రైతులు మాత్రం ఉద్యమాన్ని వదిలిపెట్టలేదు.


చివరకి సాక్షాత్తు కేంద్రమంత్రి కుమారుడు రైతులు ఆందోళన చేస్తుంటే వారిపై వాహనాన్ని తీసుకెళ్లాడు. ఈ సంఘటనలో ఐదుగురు రైతులు అసువులు బాశారు.


ఎందుకు భయం..


రైతులు ఈ నల్లచట్టాలను చూసి భయపడటానికి ప్రధాన కారణం ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర). ఇప్పటి వరకు రైతులకు సంబంధించి పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి వాటి విక్రయాలను స్థానిక వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా చేసేది. అయితే వ్యవసాయ చట్టాలు అమలైతే కనీస మద్దతు ధరను ప్రకటించే మార్కెట్‌ కమిటీలు ఎత్తివేయడంతోపాటు ఎవరైనా తమ ఇష్టానుసారంగా పంట దిగుబడులను కొనుగోలు చేసుకునే వీలు కల్పించారు.


దీని వల్ల కార్పోరేట్‌ శక్తులకు ఇది కలిసొచ్చే అంశం కాగా రైతులు మద్దతు ధర కోల్పోయే అవకాశం ఉంటుంది. దీంతోపాటు చిన్న కమతాలు కార్పోరేట్‌ శక్తుల చేతులోకి పోయే అవకాశం ఉండేది. మద్దతు ధర కోల్పోవడమే రైతులకు భారీ నష్టాని చేకూరుస్తుంది. దీంతో రైతుల నుంచి ఈ చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.


ఎన్నికల వ్యూహమా?


ఎన్నడు వెన్ను చూపరని పేరున్న నరేంద్ర మోదీ మాత్రం మొదటిసారిగా వెనుకంజ వేశారు. రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు, జాతికి క్షమాపణ చెబుతూ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇది వెనుకంజా..? రాజకీయ వ్యూహమా..? అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా..? అనేది చర్చగా మారింది. రైతు ఉద్యమానికి వేదికలుగా మారిన పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నికలు రానున్నాయి. దీంతోపాటు మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మసకబారుతున్న కమలాన్ని మరోమారు వికసించేలా చేసేందుకు నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారనే రాజకీయ విమర్శకులు అంటున్నారు. పంజాబ్‌లో పతనం అంచుకు వెళుతున్న భాజపాను కాపాడుకోవాలని, ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ చట్టాలను రద్దు చేశారా..? అనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.


ఏది ఏమైనా ఏడాది పాటు పొలాన్ని వదిలి ఉద్యమబాట పట్టిన రైతుల ఆందోళనల ముందు నరేంద్ర మోదీ తలవంచారని చెప్పక తప్పదు.


Also Read: Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన


Also Read: Farm Laws: జై కిసాన్.. ఏం చేస్తిరి.. ఏం పోరాటం చేస్తిరి.. అన్నదాత నీకు 'దేశం' సలాం


Also Read: Rakesh Tikait: రాకేశ్ టికాయత్.. అలుపెరుగని యోధుడు.. అన్నదాతను నడిపించిన నాయకుడు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి