సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీకి మండలాల్లో కంచుకోటగా ఉన్న చిలమత్తూరు జెడ్పీటీసీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనూష 2938 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికతో పాటు కొడికొండ ఎంపీటిసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి ఇర్షాద్ 36 ఓట్లతో గెలుచుకున్నారు. హిందూపురం టీడీపీకి కంచుకోట... అలాంటి చోట్ల సైతం వైసీపీ వరుసగా విజయాలు సాదిస్తూ వస్తోంది. 


గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో పాటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి తన పట్టును మరింత పెంచుకునే పనిలో పడింది. ఇప్పటికే వైసీపీలో అసమ్మతి పోరుతో సతమతమవుతున్న నేతలు.. ఎన్నికల్లో కూడా అలాగే అసమ్మతి కార్యక్రమాలు నిర్వహించారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ విజయం సాధించి బాలయ్యకు షాక్ ఇచ్చింది. చిలమత్తూరు పెద్ద మండలం కేంద్రంలోనూ టీడీపీని ఓడించటం బాలయ్యకు మైనస్ పాయింట్‌గా మారనుంది. 
Also Read: మహిళా సాధికారతలో సువర్ణ అధ్యాయం.. చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ది రావాలన్న సీఎం జగన్ !


ఇటీవల ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన పరిటాల శ్రీరాంతో పాటు, చాలా మంది నేతలు రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్ సీపీ చిలమత్తూరు జెడ్పీటీసీని కూడా కైవసం చేసుకుంది. రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో రెండుఎంపీటీసీలను గెలుచుకొని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు.. విప్ కాపు రాంచంద్రారెడ్డికి షాక్ ఇచ్చారు. అయితే చిలమత్తూరులో ఓటమిని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.


బాలయ్య నియోజకవర్గంలో పట్టు సాధించడం ద్వారా హిందూపురంలో తన హవాను ఎమ్మెల్సీ ఇక్బాల్ కొనసాగిస్తున్నారు. ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ నవీన్ నిశ్చల్ మధ్య ఆదిపత్య పోరు తీవ్రస్థాయికి చేరడంతో ఎన్నికల సమయంలో కూడా అసమ్మతి కొనసాగింది. ఇద్దరి నేతల మధ్య పోరు తీవ్రస్థాయిలో నడుస్తున్నప్పటికీ టీడీపీ గెలవలేకపోవడం స్థానిక ఎమ్మెల్యే బాలయ్యను నిరాశకు గురిచేసింది. మరోవైపు వరుస ఓటములతో బాలయ్య కూడా అసహనానికి గురవుతున్నారు. ఖర్చులోనూ టీడీపీ వెనుకాడలేదని, అయినా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.  
Also Read: చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్ష బీభత్సం... వరద ముంపులో తిరుపతి... జనజీవనం అస్తవ్యస్థం


టీడీపీ అవిర్భావం నుంచి హిందూపురంలో పార్టీకి ఓటమి లేదు. అలాంటి చోట వరుస ఓటములు టీడీపీ శ్రేణులను తీవ్రంగా కలవరపరుస్తోంది. వరుస ఓటములను తట్టుకుని నియోజకవర్గంలో పట్టుకోసం బాలయ్యతో పాటు టీడీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నప్పటికీ కలిసికట్టుగా లేకపోవడం, అధికార పార్టీకి పెరుగుతున్న మద్దతుతో హిందూపురంలో సైతం టీడీపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలను గుర్తించి, వారికి బాధ్యతలు అప్పగిస్తే ఫలితం మరో విధంగా ఉండేదని పార్టీ స్థానిక నేతల్లో చర్చ జరుగుతోంది. 


Also Read: నిరంతరం అందుబాటులో ఉంటా.. ఏం కావాలన్నా అడగండి.. సీఎం జగన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి