చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాలతో తిరుపతి నగరం జలమయం అయ్యింది. రైల్వే అండర్‌ బ్రడ్జ్‌లు వర్షపు నీటితో మునిగిపోగా.. నగరంలోని వెస్ట్‌ చర్చి, తూర్పు పోలీస్‌ స్టేషన్‌ వద్దనున్న అండర్‌ బ్రిడ్జ్‌లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. కరకంబాడి మార్గంలో భారీగా వర్షపు నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 



తిరుమాఢ వీధుల్లో వరద నీరు


తిరుమలలో భారీ వర్షాలతో కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమల రెండో కనుమదారిలో హరిణి వద్ద కొండచరియలు పడ్డాయి. పాపవినాశనం దారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసేసింది. టీటీడీ సిబ్బంది రాళ్లను తొలగిస్తున్నారు. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమాఢ వీధులు పూర్తిగా నీటితో నిండిపోయాయి. కనుమ దారులు, మెట్ల మార్గంలో వరద చేరడంతో ప్రమాదకరంగా మారాయి. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణి సమీపంలో రహదారిపై చెట్టు కూలడంతో జేసీబీలతో తొలగిస్తున్నారు. కొండపై నుంచి రహదారిపైకి మట్టి, రాళ్లు కొట్టుకువస్తున్నాయి. వైకుంఠ క్యూలైన్లలోని సెల్లార్‌లోకి వరద నీరు చేరింది. బంగాళాఖాతానికి సమీపంలో ఉండటంతో వర్షాల ప్రభావం తిరుపతిపై అధికంగా ఉంటుంది. 


13 ప్రాంతాల్లో విరిగిన కొండ చరియలు


తిరుమల రెండో ఘాట్ రోడ్డులో 13 ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. 10 జేసీబీలతో కొండచరియలు తొలగిస్తున్నారు. రేపు కూడా నడకమార్గాలు మూసివేసినట్లు టీటీడీ తెలిపింది. భారీ వర్షానికి అదనపు ఈవో క్యాంప్ కార్యాలయం నీట మునిగింది. నారాయణగిరి అతిథి గృహాలు వద్ద కొండ చరియలు విరిగిపడడంతో మూడు గదులు ధ్వంసమయ్యాయి. భక్తులు గదులలో లేకపోవడంతో  ప్రమాదం తప్పింది. నారాయణగిరి, ఎస్వీ గెస్ట్ హౌస్ లో ఉన్న భక్తులను ఇతర ప్రాంతాలకు తరలించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల కారణంగా యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, రెండు ఘాట్ రోడ్లు మూసివేశారు. ఈ నెల 19వ తేదీ వరకూ తిరుపతి నడక మార్గాలు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల అనుమతిని టీటీడీ రద్దు చేసింది. 


విమానాలు హైదరాబాద్ కు తరలింపు


చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో రేణిగుంట విమానాశ్రయంలో విమానాలు దిగడం లేదు. రన్ వే పైకి నీరు చేరింది. పరిస్థితులు అనుకూలించక విమానాలు హైదరాబాద్‌ కు మళ్లించారు. హైదరాబాద్‌-రేణిగుంట ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌ విమానాలు హైదరాబాద్‌కు మళ్లించారు.


నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవులు


జిల్లాలో భారీ వర్షాలతో గురు, శుక్రవారాల్లో అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సెలవు ప్రకటించారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే నిర్ణయం తీసుకోన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. మురకంబట్టు-దొడ్డిపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద వదర ప్రవాహంలో స్కూల్ బస్సు
చిక్కుకుంది. బస్సులో 35 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 


ఇంట్లోంచి బయటకు రావొద్దు : ఎస్పీ


భారీ వర్షాల కారణంగా జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు. సహాయక చర్యలకు స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు. ఎలాంటి విపత్తులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. తిరుపతి అర్బన్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటికీ రావాలని సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 80999 99977కు సమాచరం అందించాలని కోరారు.



కడప జిల్లాలో 


అల్పపీడన ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు  పడుతున్నాయి. జిలాల్లోని రోడ్లపై మోకాలి లోతు వరకు వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బుగ్గవంక ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగటంతో 2 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ఊటుకూరు చెరువు అలుగు పారడంతో విజయనగర్ కాలనీలోకి వరద నీరు పోటెత్తింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో నీటిని పోసేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుగ్గవంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 



నెల్లూరు జిల్లాలో 


నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని మర్రిపాడు మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిర్చి, మినప, పొగాకు పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలు వచ్చిన మరోవైపు సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి