పంజాబ్ పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంప్ వద్ద గ్రనేడ్ పేలుడు కలకలం రేపింది. ధీరాపుల్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్ ఎదుట ఈ రోజు ఉదయం పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఎలా జరిగింది?
గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి గ్రనేడ్‌ను విసిరి పారిపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఓ వివాహం జరుగుతోందని పేర్కొన్నాయి. గ్రనేడ్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన.. గ్రనేడ్ పదార్థాలను సేకరించినట్లు తెలిపారు. పఠాన్‌కోట్‌లోని అన్ని పోలీస్ చెక్‌పోస్ట్‌లను అప్రమత్తం చేశారు.
ఆ ఘటనలో..
2016 జనవరి 1 అర్ధరాత్రి దాటాక భారత ఆర్మీ దుస్తుల్లో ఉన్న కొందరు సాయుధులు పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దాడి చేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. నాలుగు రోజులకు ఆపరేషన్ ముగిసింది.
ఈ మొత్తం ఆపరేషన్‌లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడ్డారు. ఐదుగురు సాయుధులు హతమయ్యారని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న మిలిటెంట్ గ్రూప్ జైషే మహ్మద్ పనేనని భారత్ తేల్చింది.
Also Read: షాకింగ్ అధ్యయనం... గర్భస్థ శిశువుకు ప్రాణాంతకంగా మారిన ఆ వేరియంట్, ప్రసవ సమయాల్లో పెరిగిన మరణాలు