Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అశోక్ గహ్లోత్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నందున రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్‌ను నియమిస్తారని ఊహాగానాలు వచ్చాయి. దీంతో గహ్లోత్‌కు మద్దతుగా 92 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు సమర్పించారు.
సచిన్ వద్దు!
92 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్ సీపీ జోషికి అప్పగించారు. సచిన్ పైలట్‌ను సీఎంగా ప్రతిపాదించకూడదని బహిరంగంగానే తేల్చి చెప్పారు.
రంగంలోకి
ఈ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే రంగంలోకి దిగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచన మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. అశోక్ గహ్లోత్‌తో మాట్లాడారు. పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. అయితే ఇందుకు గహ్లోత్ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితులను తాను చక్కదిద్దలేనని, చేయిదాటేశాయని గహ్లోత్ చెప్పినట్లు తెలుస్తోంది.
రెండు పదవుల్లో
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో అశోక్ గహ్లోత్ ముందు వరుసలో ఉన్నారు. ఆయనే తదుపరి కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతానని గహ్లోత్.. సోనియా, రాహుల్ గాంధీకి చెప్పగా వారు దీనికి తిరస్కరించినట్లు సమాచారం.
ఒక వ్యక్తికి ఒకే పదవి ఫార్ములా ఫాలో కావాలని అధిష్ఠానం సూచించింది. అయితే కనీసం స్పీకర్ సీపీ జోషిని సీఎం చేయాలని గహ్లోత్ అడిగారట. తన రాజకీయ ప్రత్యర్ధి సచిన్ పైలట్‌ను మాత్రం సీఎం చేయడానికి వీల్లేదని గహ్లోత్ చెప్పినట్లు సమాచారం. కానీ అధిష్ఠానం సచిన్ పైలట్‌ను సీఎంగా చేయాలని యోచిస్తుందని తెలుసుకున్న గహ్లోత్ తన వర్గం ఎమ్మెల్యేలను తన వైపే ఉండేలా చూసుకున్నారు.
తనకు మద్దతుగా 92 మంది ఎమ్మెల్యేల చేత గహ్లోత్ రాజీనామా చేయించారు. అయితే గహ్లోత్‌కు మద్దతుగా రాజీనామా చేసిన వారి సంఖ్య వంద వరకు ఉందని తెలుస్తోంది.
Also Read: Maa Robot: దివ్యాంగురాలైన కూతురు కోసం ఆ నాన్న అద్భుత ఆవిష్కరణ, రోబోతో సమస్యలకు చెక్
Also Read: Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30న శశి థరూర్ నామినేషన్!