పిల్లలు చూసే కార్టూన్లు పెద్దలు చూడరు, పెద్దలు చూసే సినిమాలు పిల్లలు చూడలేరు. ఇద్దరూ చూసేవిధంగా వస్తున్న కార్యక్రమాలు చాలా తక్కువ. పాటల పోటీలు, డ్యాన్సు కార్యక్రమాల్లాంటివి ఇద్దరూ కలిసి చూడచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి టీవీ కార్యక్రమాలు కాసేపు చూస్తే ఎంతో మంచిదని సూచిస్తోంది ఓ కొత్త అధ్యయనం. పిల్లలు టీవీని ఒంటరిగా చూసే కన్నా ఇలా పేరెంట్స్‌తో కలిసి చూడడం వల్ల వారి మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతుందని అధ్యయనం వెల్లడిస్తోంది. 


ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం చిన్న పిల్లల అభిజ్ఞా అభివృద్ధిపై  టీవీ ఎక్కువ చూడడం వల్ల కలిగే ప్రభావాన్ని అధ్యయనం చేసింది. టీవీయే కాదు మొబైల్ చూడడంపై కూడా అధ్యయనం సాగింది. ఆ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 478 అధ్యయనాలను విశ్లేషించారు. వారు స్క్రీన్ చూడడం వల్ల వారి భాషా అభివృద్ధికి, కార్యనిర్వాహక పనితీరుకు హానికరంగా మారవచ్చని చెప్పింది అధ్యయనం. 


యూనివర్శిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్‌లోని సైకాలజీ విభాగానికి చెందిన డాక్టర్ ఎస్జెటర్ సోమోగి మాట్లాడుతూ "స్క్రీన్ ఎక్స్‌పోజర్ పిల్లలకి చాలా చెడు చేస్తుందని, అది వారి అభివృద్ధిపై తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని విన్నాము. అయితే ఈ పరిశోధనలో వారు చూసే కార్యక్రమాల నాణ్యత, చూసే విధానంపై కూడా దృష్టి పెట్టాము’ అని వివరించారు. 


తల్లిదండ్రులు ఉంటే...
పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు వారి పక్కనే తల్లిదండ్రులు కూడా కూర్చుని చూడడం వల్ల వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఇలా చేయడం వల్ల పిల్లలకు స్క్రీన్ సమయం మరింత ప్రయోజనకరంగా మారుతుందని సూచిస్తోంది అధ్యయనం. ఎందుకంటే ఆ సమయంలో పిల్లలు కొన్ని ప్రశ్నలు (కార్యక్రమానికి సంబంధించి) తల్లిదండ్రులు అడిగే అవకాశం ఉంది. అదే తాము ఒంటరిగా చూస్తూ వారి మెదడు పెద్దగా పనిచేయదు. పిల్లల అభిజ్ఞా అభివృద్ధిపై టీవీ ప్రభావం ఎక్కువ. కాబట్టి తల్లిదండ్రులు కాసేపు పక్కన కూర్చుంటే పిల్లల స్క్రీన్ సమయం ప్రయోజనకరంగా మారుతుంది. కోవ్యూయింగ్ (కలిసి చూడడం) అనేది పిల్లల సంభాషణ నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుందని అధ్యయనం తేల్చింది. 


రోజులో ఎక్కువసేపు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడడం కుదరకపోవచ్చు. కానీ రోజులో కాసేపైనా వారితో టీవీ వీక్షించడం ఎంతో మేలు జరుగుతుంది. ఆ సమయంలో వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కచ్చితంగా ఇవ్వాలి. ‘కామ్‌గా టీవీ చూడు’,‘మాట్లాడకు’ వంటివి చెప్పడం వల్ల ప్రయోజనాలు ఉండవు.  


Also read: రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం


Also read: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.