Potatoes: బంగాళాదుంపలు భూమిలో పెరుగుతాయి. దాని వల్ల వాటికి మట్టి ఎక్కువగానే అంటుకుంటుంది. ఆ మట్టి వదలడానికి కాస్త ఎక్కువ సమయమే వాటిని కడగాలి. ఈ కారణంగానే చాలా మంది తొక్కను ఒలిచేస్తారు. తొక్కను తీసేయడం వల్ల ఎన్ని నష్టాలో తెలుసా? శరీరానికి అందాల్సిన ఎన్ని పోషకాలు వేస్టుగా పోతాయో తెలుసా? అవి తెలుసుకోవాలంటే చదవండి. 


1. బంగాళాదుంప తొక్కల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. కాల్షియం, బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి తొక్కతీసి తినకుండా తొక్కతో పాటే వండుకోవడానికి ప్రయత్నించండి. 


2. బంగాళాదుంప తొక్కలో ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా వ్యవహరిస్తాయి. ఇవి శరీరానికి అత్యవసరమైనవి. వీటిలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ మన శరీరాన్ని క్యాన్సర్ నుంచి కాపాడతాయి. 


3. ఈ తొక్కలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, గ్లైకోఅల్కలాయిడ్స్  అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. 


4. బంగాళాదుంపలను తొక్కతో పాటూ తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం చాలా తగ్గుతుంది. దీనికి కారణం ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. 


5. అందానికి కూడా బంగాళాదుంప తొక్కలు మేలు చేస్తాయి. వీటిలో యాంటీ బ్యాక్టిరియల్, ఫినాలిక్, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. తొక్కలను ముఖంపై మొటిమలు, మచ్చలున్న చోట రుద్దుకుంటే మంచిది. ఇవి బ్లీచింగ్‌లా పనిచేస్తాయి. 


6. ఈ తొక్కల్లో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, రాగి, జింక్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అత్యవసరమైనవి. ఇవి ఎముకల వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. 


7. బంగాళాదుంప తొక్క నుంచి తీసిన రసంతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలు మెరుస్తాయి కూడా. 


నిజానికి బంగాళదుంప వేపుడు వంటివి తొక్కతో కలిపి చేస్తేనే టేస్టు అధికంగా ఉంటుంది. కూర ముద్దవ్వకుండా వస్తుంది. బంగాళాదుంపల తొక్కలకు ఎక్కువ మట్టి, మురికి ఉంటుందనుకుంటే నీటిలో ఓ పావుగంట నానబెట్టండి. ఆ తరువాత కడిగితే ఏంత మట్టి అయినా పోతుంది. అంతేకాదు తొక్కలను తీసి తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు తక్కువ. 


Also read: వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే


Also read: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.