రాత్రి త్వరగా నిద్రపోవాలని, తెల్లవారుజామునే లేవాలని చెబుతుంటారు పెద్దలు. అదే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు. కానీ ఈ ఆధునిక కాలంలో ఎంత మంది తెల్లవారుజామున లేస్తున్నారు? ఎంతమంది రాత్రి తొమ్మిదిలోపు నిద్రపోతున్నారు? చాలా తక్కువనే చెప్పాలి. ఎవరైతే అర్థరాత్రి మేల్కొని ఉండి, రాత్రి పన్నెండు తరువాత నిద్రపోతారో అలాంటి వారికి ఇది హెచ్చరిక. వారు మిగతావారితో పోలిస్తే అతి త్వరగా మధుమేహం, గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. కొత్త అధ్యయనం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. ఆ అధ్యయనంలో... ఆలస్యంగా నిద్రపోయేవారిలో శక్తి కోసం కొవ్వును ఉపయోగించుకునే సామర్థ్యం తగ్గిపోతుంది అని చెబుతున్నారు పరిశోధకులు. దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల రక్తంలో కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోయి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. తద్వారా సమీప భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం అధికమవుతుంది.
ఇన్సులిన్ ప్రభావితం...
సిర్కాడియన్ రిథమ్ ... అంటే ఏమిటో తెలియడం లేదు కదా. మన మెదడులో జీవగడియారం (బయోలాజికల్ క్లాక్) ఉంటుంది. ఇది మనం రోజూ పడుకునే సమయాన్ని, నిద్రలేచే సమయాన్ని సెట్ చేసుకుంటుంది. అంటే మీరు రోజూ రాత్రి పదిగంటలకు నిద్రపోతే... ఆ సమయానికల్లా కచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది. ఇలా జీవగడియారంలో సెట్ అయిన టైమింగ్స్ ప్రకారమే నిద్ర పోవడం, లేవడాన్ని ‘సిర్కాడియన్ రిథమ్’ అంటారు. ఈ టైమింగ్స్ రోజూ మారుతుంటే సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. దీనివల్ల మన శరీరం ఇన్సులిన్ ఉయోగించే తీరుపై ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని అమెరికాలోని రట్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు.
అధ్యయనం ఇలా...
త్వరగా నిద్రపోయేవారిని, ఆలస్యంగా నిద్రపోయేవారిని రెండు గ్రూపులుగా విడదీశారు. వారిని కొన్ని రోజుల పాటూ పరిశీలించారు. వారి ఆహారపు అలవాట్లు, వ్యాయమం, శరీర శక్తి అన్నింటినీ పరిశీలించారు. అయితే పనులు చేసేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు త్వరగా నిద్రపోయే అలవాటు ఉన్నవారు, ఆలస్యంగా నిద్రపోయే వారికన్నా ఎక్కువ శక్తిని వినియోగిస్తున్నట్టు కనుగొన్నారు. వారి శరీరంలో కొవ్వు ఖర్చవ్వడం కూడా అధికంగానే ఉంది. అంటే వీరు ఊబకాయం బారిన పడడం తక్కువనే చెప్పాలి. అలాగే రక్తంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం కూడా తక్కువ. కానీ ఆలస్యంగా నిద్రపోయేవారిలో మాత్రం కొవ్వు ఖర్చవ్వకపోవడాన్ని గుర్తించారు. అలాగే ఇన్సులిన్ నిరోధకతను అధికంగా కలిగిఉన్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడానికి ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ నిరోధకత వల్ల వీరి రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం అధికం. అందుకే రాత్రి ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
Also read: బంగాళాదుంపలు తొక్క తీసి వండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం, ఈ లాభాలన్నీ కోల్పోవాల్సిందే
Also read: వాతావరణం చల్లగా ఉందా? ఆ సమయంలో మీరు తినకూడని కూరగాయలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.