Pawan Politics :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీకెండ్ పొలిటిషియన్ అని  వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేస్తూంటారు. పార్ట్ టైమ్ పాలిటిక్స్‌తో ఆయన ఏం చేయగలరని సెటైర్లు వేస్తూంటారు. దీనికి కారణం పవన్ కల్యాణ్.. ఎప్పుడో ఓ సారి వచ్చి ప్రసంగించడం .. లేదో ఓ రైతు భరోసా యాత్ర పెట్టుకోవడం చేస్తున్నారు కానీ నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయడంలేదు. ఎన్నికల వేడి పెరిగిపోతున్న సమయంలో యాత్ర ప్రకటించి కూడా వాయిదా వేసుకున్నారు. అలా చేస్తున్న రాజకీయం వల్ల జనసైనికుల్లోనూ సీరియస్ నెస్ తగ్గిపోతోంది.   మీడియాలో, సోషల్ మీడియాలో జనసేన పేరుతో ఉనికి కనిపిస్తోంది కానీ .. క్షేత్ర స్థాయి పోరాటాల్లో మాత్రం వెనుకబడిపోయారు. అసలు పవన్ కల్యాణ్ అధికారం కోసం ప్రయత్నిస్తున్నారా ? లేకపోతే కనీసం చట్టసభలో అడుగుపెడితే చాలనుకుటున్నారా ? అన్నది సస్పెన్స్ గా మారింది. 


రాజకీయ కార్యక్రమాలన్నీ అసంపూర్తిగానే !


ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. అన్ని జిల్లాల్లో పూర్తి కాలేదు. అలాగే జనవాణి అనే కార్యక్రమం చేపట్టారు. అదీ అంతే. ఎప్పుడో ఓ సారి అమరావతి వస్తారు .. ఓ మీటింగ్ పెడతారు.  అది సహంజంగా ఆదివారం రోజే అయి ఉంటుంది. రోజున బరువైన ప్రకటనలు చేస్తారు. వెతర్వాతేంటి అంటే స్పష్టత ఉండదు.  దసరా నుంచి బస్సు యాత్ర ప్రకటించారు.  మళ్లీ వాయిదా వేశారు. జనవాణిలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడానికన్నారు. కానీ ఈ కారణం అంత నమ్మశక్యంగా లేదు. 


పార్టీ భారం నాదెండ్ల మనోహర్ పైనే  !


సినిమాలు చేయనే చేయనని చెప్పిన పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సినిమా తన బతుకుదెరువు అని చెప్పి మళ్లీ సినిమాలు చేస్తున్నారు.  పార్టీని నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. మొత్తం పార్టీని నాదెండ్ల నడుపుతున్నారు.  ఇక ఎన్నికల వేడి ప్రారంభమైంది జగన్ ముందస్తుకు వెళ్తారు అనే వాతావరణం వచ్చినా పవన్ కల్యాణ్‌లో పెద్దగా మార్పు లేదు. పవన్ కల్యాణ్ చాలా సినిమాల కమిట్ మెంట్స్ పెట్టుకున్నారు.   వాటిని చేస్తూనే రాజకీయ పార్టీకి సమయం కేటాయించాల్సిన పరిస్థితి. నాదెండ్ల మనోహర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ పవన్‌తో పోలిస్తే ఆయనను పెద్దగా పట్టించుకోరు. కానీ శక్తివంచన లేకుండా నాదెండ్ల మనోహర్ పార్టీ కోసం తిరుగుతున్నారు. అయితే పవన్ తిరగడం వేరు.. నాదెండ్ల తిరగడం వేరు. 


పవన్ కల్యాణ్ చట్టసభలోకి రాకపోతే కష్టం !


పవన్ కల్యాణ్  ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి. అయితే ఆయన పార్టీ అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు కానీ ఆయన చట్టసభల్లోకి అడుగు పెట్టాలి. అయితే అదంత తేలిక కాదు. గత ఎన్నికల్లో సామాజిక వర్గ పరంగా కూడా ఎంతో ప్లస్ అవుతుందని పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లోనే కలసి రాలేదు. ఈ సారి ఆయన మరింత పకడ్బందీగా వ్యవహరించాలి. పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఓటేసిన తరవాత ఆయన సినిమాలు చేసుకుంటారనే డౌటే ఎక్కువ మందికి ఉందని రాజకీయవర్గాల అభిప్రాయం. బయటపడరు కానీ జనసైనికులదీ అదే అభిప్రాయమని చెబుతారు. 


సమయం మించిపోతోంది..  లేటైతే బస్ మిస్ అవుతుంది !


పవన్ కల్యాణ్ ఇప్పటికైనా వెంటనే పూర్తి స్థాయిలో రాజకీయాలు ప్రారంభించకపోతే ప్రజల్లో సీరియస్ నెస్ పోతుంది. అయితే ఎప్పట్లాగే ఇలాగే రాజకీయం చేసి పోటీ చేసి.. ఆరేడు శాతం ఓట్లు సాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చట్టసభల్లో సీట్లు ఉంటేనే విలువ. ఓట్లు చీలనిచ్చేది లేదని ..చెబుతున్నందున టీడీపీ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నా..  ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నా...  బలంగా ఉన్నామని చెప్పి ఎక్కువ సీట్లు పొందాలన్నా రాజకీయంగా వేగం పుంజుకోవాలి. లేకపోతే జనసేనాని రాజకీయం పార్ట్ టైమ్ అని జనసైనికులు కూడా నమ్మే పరిస్థితి వస్తుంది.