నిజమాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకీ క్యాడర్ కన్ ఫ్యూజన్ లో పడుతోంది. జిల్లా నుంచే ముగ్గురు నాయకులు పీసీసీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, బొమ్మ మహేష్ కుమార్. సుదర్శన్ రెడ్డి పీసీసీ కోశాధికారిగా బాధ్యలు నిర్వహిస్తుంటే.... మాజీ ఎంపీ మధయాష్కీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ గా పదవి నిర్వహిస్తున్నారు.


అయితే నిజామాబాద్ జిల్లా నుంచి ముగ్గురు పీసీసీలో కీలక పదవులు నిర్వహిస్తున్నప్పటికీ... జిల్లాకు మాత్రం ముఖం చాటేస్తున్నారని కాంగ్రెస్ క్యాడర్ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి అడపాదడపా జిల్లాకు వస్తున్నప్పటికీ... మాజీ ఎంపీ మధుయాష్కీ మాత్రం జిల్లాకు రావటమే మానేశారు. మధుయాష్కీ ఎక్కువగా ఢిల్లీ, హైదరాబాద్ లోనే గడుపుతున్నారనేది కాంగ్రెస్ క్యాడర్ లో వాదన. మంచి లాబియిస్ట్ గా పేరున్న మధుయాష్కీ రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉంటారన్న పేరుంది. రాష్ట్రంలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి రెండు సార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. మధుయాష్కీ నిజామాబాద్ స్థానికుడు కాకున్నా... ఇక్కడి ప్రజలు ఆయన్ను ఆదరించారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీకి ఒక్క సుదర్శన్ రెడ్డి మాత్రమే ఎన్నికయ్యారు. కానీ మధుయాష్కీని మాత్రం ఎంపీగా నిజామాబాద్ జిల్లా ప్రజలు గెలిపించారు. తెలంగాణ ఉద్యమానికి కూడా మధుయాష్కీ గట్టిగానే సపోర్ట్ చేశారు. అయితే గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో మధుయాష్కీ ఓటమి చవిచూశారు.


ప్రస్తుతం తెలంగాణలో పోలిటికల్ హీట్ మొదలైంది. అన్ని పార్టీలు గెలుపు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయ్. జిల్లాల్లో తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయ్. జిల్లాకు సీనియర్ లీడర్ గా ఉన్న మధుయాష్కీ మాత్రం ఇటువైపే చూడటం లేదన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు పూర్తిగా రావటమే మానేశారని హస్తం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గతంలో మంచి పట్టుండేది. రానురాను పూర్తిగా పార్టీ దిగజారి పోతోంది. పార్టీ పూర్వవైభవం తెచ్చే ప్రయత్నమే చేయటం లేదన్న వాదనా వినిపిస్తోంది. ఇటు మధుయాష్కీ గ్రాఫ్ కూడా జిల్లాలో తగ్గుతూ వస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన మధుయాష్కీకి కేవలం 69 వేల ఓట్లు మాత్రమే వచ్చాయ్.


జిల్లాలో మధుయాష్కీకి క్యాడర్ లేని లీడర్ గా పేరుంది. ప్రస్తుతం పూర్తిగా జిల్లాకు దూరంగా ఉండటంతో జిల్లా హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కొరవడుతూ వస్తోంది. మరోవైపు అసలు జిల్లా నుంచి ఈ సారి మధుయాష్కీ గౌడ్ పోటీ చేసే అవకాశాలు కూడా తక్కువే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మధుయాష్కీ మల్కాజ్ గిరి నుంచి బరిలోకి దిగుతారన్న పుకార్లు చక్కర్లు కొడుతున్నాయ్. అందుకే ఆయన పెద్దగా నిజామాబాద్ జిల్లాపై ఫోకస్ పెట్టడం లేదన్న ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలలో మధుయాష్కీ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగానే ఉంటాయ్. కానీ మధుయాష్కీ జిల్లాకు రావటం మానేశారు. మరోవైపు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన దూరంగా ఉన్నారన్న చర్చ కూడా వినిపిస్తోంది.