YSRCP Politics :   ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీలో పర్యవేక్షకుల పంచాయతీ ప్రారంభమైంది. అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు, ఇంచార్జులు ఉండగా వారికి పోటీగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఓ పర్యవేక్షకుడ్ని నియమించాలని సీఎం జగన్ నిర్ణయించడమే దీనికి కారణం. ఇప్పటికే జాబితా కూడా రెడీ అయిపోయిందని కానీ ప్రకటిస్తే ఎలాంటి  పరిస్థితులు ఉంటాయోనని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారని చెబుతున్నారు. 


పోటీగా పర్యవేక్షకుడ్ని పెడితే ఎమ్మెల్యేలు ఊరుకుంటారా ? 


నియోజ‌క‌వ‌ర్గానికి పార్టి నుండి ఎమ్మెల్యేనే ఇప్ప‌టి వ‌ర‌కు సుప్రీంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు లేని చోట్ల ఇంచార్జులుగా అనధికార ఎమ్మెల్యేగా పెత్తనం చేస్తున్నారు.  ఇప్పుడు పార్టి ప‌రంగా మ‌రో వ్య‌క్తిని నియోజ‌వ‌క‌ర్గానికి ప‌ర్యవేక్ష‌కులుగా నియ‌మించ‌టం వ‌ల‌న వ‌ర్గాలు పెరిగి, గ్రూపులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం లో చోటు చేసుకున్న ప‌రిణామాలు తలనొప్పిగా మారాయి. అక్కడ ఎమ్మెల్యే శ్రీదేవిని కాదని అదనపు ఇంచార్జ్ గా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమించారు. దాంతో  గ్రూపు తగాదాలు ప్రారంభమయ్యాయి. తాడికొండలో  ఆ రెండు వర్గాల మధ్య సయోధ్య చేయడం హైకమాండ్  వల్ల కావడం  లేదు. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకూ ఇంచార్జుల్ని నియమిస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లోఅదనంగా ఉంది. 


పోటీ ఉంటేనే పార్టీ  బలపడుతుందంటున్న సీఎం జగన్ !


నియోజకవర్గాలకు అదనంగా ఇంచార్జుల్ని నియమించాలని పార్టీ అధినేత జగన్ పట్టుదలగా ఉన్నారు. అసంతృప్తి పెరుగుతుందని..గ్రూపుల గోల ఎక్కువ అవుతుందని ఇతర నేతలు చెబుతున్న విషయాన్ని ఆయన అంగీకరించడం లేదు.  పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు పోటీ ఉండాలని అందుకే నియోజ‌క‌వ‌ర్గానికి ప‌ర్య‌వేక్ష‌కుల‌ను నియ‌మించాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.   ఇప్ప‌టికే పార్టి నేత‌లు ఈ వ్య‌వ‌హ‌రం పై తోచిన‌ట్లుగా అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంటున్నారు. పర్యవేక్షకులు.. పరిశీలకులు లేదా ఇంచార్జులు ఏ పేరుతో అయనా సరే వేరొకరిని నియమిస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుదని పార్టీ నేతలు ఆందోళనచెందుతున్నారు.  


పీకే టీంల సర్వే కారణంగానే !


ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ టీం ఈ సారి కూడా వైఎస్ఆర్‌సీపీకి సేవలు అందిస్తోంది. అయితే పీకే బీహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు . ఆయన తర్వాత స్థానంలో ఉన్న రిషిరాజ్ పీకే సలహాలతో ఇక్కడ స్ట్రాటజీల్ని అమలు చేస్తున్నారు. ఆయన తన టీములతో విస్తృతంగా నిర్వహిస్తున్న సర్వే రిపోర్టుల ఆధారంగానే జగన్ ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. వారి సలహాతోనే నియోజకవర్గ ఇంచార్జుల్ని నియమించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. 


పది చోట్లా... అన్ని చోట్లా ?


అన్ని చోట్లా  సమన్వయకర్తల్ని నియమించాలని అనుకుంటున్నప్పటికీ ముందుగాఓ పది మందిని నియమిస్తే ఎలా ఉంటుందన్న  ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇలా నాన్చే రకం  కాదని అన్ని స్థానాలకూ పరిశీలకుల్ని ప్రకటిస్తారని చెబుతున్నారు.  దసరాలోపే ఈ ప్రకటన ఉంటుందని కూడా చెబుతున్నారు.