Notice To APCID : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కొల్లు అంకబాబు అనే రిటైర్డ్ జర్నలిస్టును ఓ వార్తను వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేశారన్న కారణంగా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో సీఐడీ తాము నోటీసులు ఇచ్చినా అంకబాబు తీసుకోలేదని అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే అంకబాబు పోలీసులు తన ఇంటికి వచ్చినప్పటి నుండి సీఐడీ అఫీసుకు తీసుకెళ్లే వరకూ ప్రతీ దృశ్యాన్ని వీడియోగా చిత్రీకరించారని ..తనకు నోటీసులు ఇచ్చారో లేదో అవి చూస్తే తెలిసిపోతుందని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తన ఎదుట నోటీసులు ఇవ్వాలని సీఐడీని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ సీఐడీ అలా నోటీసులు ఇవ్వడం కుదరదని చెప్పింది. ఆ సమయంలో బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి .. సీఐడీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
నిందితుడికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్లుు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. నాలుగురోజుల్లోగా జర్నలిస్ట్ అరెస్ట్ వ్యవహారంలో జరిగిన పరిణామాలను వివరించాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ అధికారులు ఇటీవలి కాలంలో పలువుర్ని ఇలా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. ఆ తరవాత కోర్టు రిమాండ్ తిరస్కరించడంతో వదిలి పెట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాల కారణంగా సీఐడీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం సంచలనంగా మారింది. ఏపీసీఐడీకి ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ పెద్దలే తెచ్చి పెట్టారని విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం ... విపక్ష నేతల్ని భయపెట్టేందుకు సీఐడీని ఉపయోగించుకుంటున్నారని.. దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఈ అంశంపై ఇతర టీడీపీ నేతలు కూడా స్పందించారు. జగన గతంలో ఐఏఎస్‌లను జైలుకు పంపారని.. ఈ సారి ఐపీఎస్‌లను కూడా పంపుతున్నారని లోకేష్ విమర్శించారు.
కొందరు అధికారులు పోలీస్ వ్యవస్థను జగన్ రెడ్డి ప్రాపకం కోసం దిగజారుస్తున్నారని ఇప్పటికైనా మారాలని టీడీపీ నేతలు సలహా ఇచ్చారు.