Roger Federer Farewell: రోజర్ ఫెదరర్- రఫెల్ నాదల్.. టెన్నిస్ ప్రపంచంలో ఈ పేర్లు తెలియని వారుండరు. ప్రత్యర్థులుగా ఎన్నో మ్యాచుల్లో తలపడిన వీరు.. మైదానం బయట మాత్రం మంచి స్నేహితులు. కోర్టులోనే వారి మధ్య పోటీ. బయట ఒకరంటే మరొకరికి అభిమానం. అందుకే తన సహచరుడు ఇక టెన్నిస్ ఆడడు అన్న విషయం నాదల్ ను కలచివేసింది. తనతో తలపడే అవకాశం ఇంక ఉండదు అన్న విషయం కన్నీళ్లు పెట్టించింది. ఈ భావోద్వేగ సన్నివేశానికి రాడ్ లేవర్ కప్ వేదికైంది. 


ఇదే చివరి మ్యాచ్ 
 టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్ స్లామ్ టైటిల్ వీరుడు రోజర్ ఫెడరర్ ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23న జరిగిన టీం ఈవెంట్ రాడ్ లేవర్ కప్ 2022 అతనికి చివరి టోర్నీమెంట్. రాడ్ లేవర్ కప్ మొత్తానికి ఫెడరర్ అందుబాటులో ఉండడంలేదు. మొదటి రోజు జరిగిన డబుల్స్ మ్యాచ్ తర్వాత అతడు మళ్లీ రాకెట్ పట్టలేదని సమాచారం. దాంతో ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక డబుల్స్ మ్యాచ్ లో మరో దిగ్గజ ప్లేయర్ రాఫెల్ నాదల్ తో కలిసి రోజర్ బరిలోకి దిగాడు. వీరిద్దరూ టీం యూరప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి జంట టీం వరల్డ్ కు చెందిన టియాఫే-జాక్ సాక్ జంటతో తలపడింది. 


 






 


నాదల్ భావోద్వేగం 
ఈ మ్యాచ్ సందర్భంగా ఒక సన్నివేశం టెన్నిస్ అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. రోజర్ చివరి మ్యాచ్ ఆడిన తర్వాత అతని ప్రత్యర్థి, స్నేహితుడు అయిన రఫెల్ నాదల్ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. చన చిరకాల స్నేహితుడు ఇక ఆడడు అన్న విషయం గుర్తొచ్చిన నాదల్ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నాడు. అతన్ని చూసిన ఫెదరర్ కూడా కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఈ దృశ్యం టెన్నిస్ అభిమానులందరినీ కదిలించింది.


చిరకాల స్నేహితులు 
 2017 లావెర్ కప్‌లోనూ రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ కలిసి ఆడారు. నాదల్ (22), జొకోవిక్ (21), ఫెదరర్ (20), ఆండీ ముర్రే (3) కలిసి 66 గ్రాండ్‌స్లామ్‌లు సాధించారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ఫెదరర్ 2021 వింబుల్డన్ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడు. 41 ఏళ్ల ఈ స్విస్ గ్రేట్ గతవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాలుగా నాదల్‌తో పోటీని ఆస్వాదించాడు. పురుషుల టెన్సిస్‌లో ఇద్దరు కలిసి 42 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించారు. వీరిద్దరూ 9 గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ సహా 40 మ్యాచుల్లో తలపడ్డారు. నాదల్ 24, ఫెదరర్ 16 విజయాలు సాధించారు. 


2003 వింబుల్డన్‌లో తొలిసారి విజేతగా నిలిచి టైటిల్ సొంతం చేసుకున్న ఫెదరర్.. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరియర్‌లో మొత్తంగా 6 ఆస్ట్రేలియా ఓపెన్, 8 వింబుల్డన్, 5 యూఎస్ ఓపెన్ టైటిళ్లతో పాటు ఒక ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి పురుషుల సింగిల్స్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.






రాడ్ లేవర్ కప్.. 
రాడ్ లేవర్ కప్ ఏటా జరుగుతుంది. ఇందులో టీం యూరప్, టీం వరల్డ్ జట్లు తలపడతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ లో రోజుకు మూడు సింగిల్స్, ఒక డబుల్స్ పద్ధతిన మొత్తం నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. తొలి రోజు ప్రతి మ్యాచ్ లో గెలిచిన జట్టుకు ఒక్కో పాయింట్ చొప్పున.. రెండో రోజు గెలిచిన ప్రతి మ్యాచ్ కు రెండు పాయింట్ల చొప్పున.. మూడో రోజు గెలిచిన ప్రతి మ్యాచ్ కు మూడు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. ఇలా ఏ జట్టు అయితే 13 పాయింట్లను ముందుగా సాధిస్తుందో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. టీం యూరప్ లో ఫెడరర్, నాదలతో పాటు నొవాక్ జొకోవిచ్ కూడా ఉన్నాడు. బిగ్ త్రీ గా వీరిని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఈ ముగ్గురు ప్లేయర్స్ 63 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలవడం విశేషం. అయితే తొలి రోజు జొకోవిచ్ పోటీలో లేడు.