Smart Umpiring in IPL 2025:  IPLఇప్పుడు కేవలం ఫోర్లు-సిక్స్‌లు, ఉత్కంఠ ఎండింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. మైదానం ప్రతి మూలలోనూ సాంకేతికత కనిపిస్తోంది. ఏ చిన్న మోమెంట్ మిస్ అవ్వకుండా ఉండేలా అడుగడుగునా కెమెరా కళ్లు చూస్తున్నాయి. ఆటగాళ్ళ నుంచి అంపైర్లు వరకు ప్రతి విషయాన్ని క్యాప్చర్ చేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న IPL మ్యాచ్‌ల్లో సాంకేతికతే సూపర్‌స్టార్‌గా మారుతోంది. 

IPLని మరింత అధునాతనంగా చేస్తున్న, దూరంగా ఎక్కడో కూర్చున్న అంపైర్‌కు కూడా చిన్నచిన్న విషయాలను స్పష్టంగా చూపించడంలో సహాయపడుతున్న అటువంటి సాంకేతికతలు గురించి ఇక్కడ చూద్దాం. 

1. DRS-  DRS అంటే డిసిషన్ రివ్యూ సిస్టమ్. అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశాన్ని ఇది ఆటగాడికి ఇస్తుంది. ఒక ఆటగాడు ఔట్ అయ్యాడనో లేదా అవుట్‌ కాలేదనో అంపైర్ నిర్ణయిస్తే దాన్ని సవాల్ చేసే అధికారం ఆటగాళ్లకు ఉంటుంది. వాళ్లు DRS తీసుకోవచ్చు. అలాంటి డీఆర్‌ఎస్‌లో మూడు ప్రత్యేక సాంకేతికతలు పనిచేస్తాయి. 

హాక్-ఐ: బంతి ఎక్కడ పడింది, ఎక్కడ ల్యాండ్ అయింది. వికెట్ వైపు వెళుతుందా లేదా అని చూపిస్తుంది.

అల్ట్రాఎడ్జ్: బంతి బ్యాట్‌కు తగిలిందా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెబుతోంది. ఇలా తాకుతూ వెళ్లినా కూడా ఇందులో తెలిసిపోతోంది. 

బాల్ ట్రాకింగ్: బంతి ప్యాడ్‌ను తాకిన తర్వాత వికెట్ వైపు వెళుతుందా లేదా అని తెలియజేస్తుంది. ఈ మూడు కలిసి మైదానంలో ఉన్నా లేదా దూరంలో కూర్చున్నా థర్డ్ అంపైర్ సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడతాయి.

2. స్పైడర్‌క్యామ్- స్పైడర్‌క్యామ్ అనేది తీగల సహాయంతో గాలిలో ఎగురుతున్న, ఎయిరియల్ వ్యూ అనుభూతిని క్రికెట్ అభిమానలుకు పంచే కెమెరా. దీని ద్వారా బ్యాట్స్‌మన్ ప్రతి కదలిక, ఫీల్డింగ్ పొజిషన్స్‌, రన్నింగ్ సమయంలోని యాక్షన్‌ను పై నుంచి చూడవచ్చు. ఈ కెమెరా అంపైర్ కోసం కంటే ప్రేక్షకులు, కామెంటరీ బృందం కోసం, మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా చేస్తుంది.

3. LED స్టంప్స్- LED స్టంప్స్ అనేది ఒక కొత్త, స్మార్ట్ సాంకేతికత. IPLలో పాత చెక్క స్టంప్స్ స్థానంలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ స్టంప్స్, బెల్స్ లోపల సెన్సార్లు ఉంటాయి. బంతి స్టంప్స్‌ను ఢీకొన్నప్పుడు లేదా బెల్స్ కొద్దిగా కదిలినప్పుడు ఇవి వెంటనే మెరుస్తాయి. దీని ద్వారా థర్డ్ అంపైర్‌కు బంతి స్టంప్‌ను తాకిందా లేదా బ్యాట్ క్రీజ్ లోపల ఉందా లేదా అని స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా రనౌట్ లేదా స్టంపింగ్ వంటి నిర్ణయాల్లో ఈ సాంకేతికత స్పష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. 

4. స్మార్ట్ రిప్లే సిస్టమ్- IPLలో ఇప్పుడు థర్డ్ అంపైర్‌కు ప్రతి విషయాన్ని స్పష్టమైన, వెంటనే రిప్లేను పొందే వ్యవస్థ ఉంది. దీనిని స్మార్ట్ రిప్లే సిస్టమ్ అంటారు. ఈ సాంకేతికత ద్వారా అంపైర్ ఎక్కువగా వేచి ఉండనక్కరలేదు. నిర్ణయం త్వరగా జరుగుతుంది. అభిమానులు కూడా రిప్లే వెంటనే చూసుకోవచ్చు. నిర్ణయం క్షణాల్లో జరుగుతుంది. ఈ వ్యవస్థ ప్రత్యేక కెమెరాలు, సాఫ్ట్‌వేర్ సహాయంతో అవసరమైన ప్రతి మూమెంట్‌ను స్క్రీన్‌పై చూపిస్తోంది. 

5. ప్లేయర్ ట్రాకింగ్ సిస్టమ్- ఈ సాంకేతికతలో ఆటగాడి శరీరంపై లేదా దుస్తుల్లో GPS, మోషన్ సెన్సార్లు ఉంటాయి. ఆటగాడు పరుగెత్తినప్పుడు, ఫీల్డింగ్ చేసినప్పుడు లేదా విసిరినప్పుడు, ఈ పరికరాలు అతని ప్రతి కదలికను ట్రాక్ చేస్తాయి. రన్నింగ్ వేగం ఎంత ఉంది, ఎంత దూరం ప్రయాణించింది, విసిరే వేగం ఎంత ఉంది మొదలైన అన్నింటినీ చూపిస్తాయి. ఈ డేటా టీవీలో కనిపించే అద్భుతమైన యానిమేషన్‌లను సృష్టించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఫీల్డర్ పనితీరు విశ్లేషణలో కూడా సహాయపడుతుంది. ప్రతి ఆటగాడి కష్టాన్ని కోచ్ మాత్రమే కాదు, కోట్ల మంది అభిమానులు కూడా స్పష్టంగా చూడవచ్చు.