IPL 2025 MI 5th Victory: టోర్నీలో కీలక దశలో ముంబై ఇండియన్స్ పంజా విసురుతోంది. వరుసగా విజయాలు సాధిస్తూ, మంచి టచ్ లోకి వచ్చింది. ముఖ్యంగా వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది. బుధవారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 143 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (44 బంతుల్లో 71, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేదనను 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 146 పరుగులు చేసి, ముంబై ఇండియన్స్ పూర్తి చేసింది. విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ (46 బంతుల్లో 70, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఫిఫ్టీతో మరోసారి సత్తా చాటాడు. తాజా ఫలితంతో ముంబై టాప్-3కి ఎగబాకగా, సన్ ఆరో ఓటమిని మూటగట్టుకుంది.
టాపార్డర్ ఘోర వైఫల్యం..సొంతగడ్డపై భారీ స్కోరు సాధిస్తుందనుకున్న సన్ రైజర్స్ తుస్సుమంది. టాపార్డర్ వైఫల్యంతో కనీసం సవాలు విసరగలిగే స్కోరును సాధించలేకపోయింది. ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్లోనే ట్రావిస్ హెడ్ డకౌటయ్యి షాకిచ్చాడు. ఆ తర్వాత తర్వాతి ఓవర్లో ఇషాన్ కిషాన్ (1) విచిత్రంగా ఔటయ్యాడు. లెగ్ సైడ్ వేసిన బంతిని షాట్ ఆడగా, అది కీపర్ చేతుల్లో పడింది. అయితే బ్యాట్ కు బంతి తాకిందని పొరపాటు పడి, ఎవరూ అపీల్ చేయకుండానే, అంపైర్ ఔటివ్వకుండానే పెవిలియన్ కు చేరిపోయి షాకిచ్చాడు. ఆ తర్వాత ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ (8), నితీశ్ కుమార్ రెడ్డి (2), అనికేత్ వర్మ (12) విఫలం కావడంతో ఒక దశలో 35/5 తో అభిమానులకు హార్రర్ షో చూపించింది. ఈ దశలో అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కలిసి క్లాసెన్ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఆరంభంలో చాలా జాగ్రత్తగా ఆడిన వీరిద్దరూ తర్వాత, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో 34 బంతుల్లో క్లాసెన్.. ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఆఖరి ఓవర్లలో క్లాసెన్ ఔటయ్యాడు. దీంతో 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అభినవ్ కూడా త్వరగా ఔటవడంతో సన్.. 150 పరుగుల మార్కును దాటలేక పోయింది. మిగతా బౌలర్లలో దీపక్ చాహర్ కు రెండు వికెట్లు దక్కాయి. క్లాసెన్ వికెట్ తీసిన బుమ్రా టీ20ల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
రోహిత్ రపారపా.. ఇక చిన్న టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ర్యాన్ రికెల్టన్ (11) త్వరగా ఔటైనా, విల్ జాక్స్ (22) తో కలిసి రోహిత్ జట్టును ముందుకు నడిపించాడు. జాక్స్ నెమ్మదిగా ఆడగా, రోహిత్ కాస్త వేగంగా ఆడాడు. ముఖ్యంగా తన మార్కు కళ్లు చెదిరే సిక్సర్లతో అలరించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్ కు 64 పరుగులు జోడించాక జాక్స్ పెవిలియన్ కు చేరాడు. ఆ తరవాత సూర్య కుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి ఛేజింగ్ ను వడివడిగా పూర్తి చేసేందుకు రోహిత్ ప్రయత్నించాడు. వీరిద్దరూ బౌండరీలతో డీల్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. వీరిద్దరూ 3వ వికెట్ కు 53 పరుగులు జోడించడంతో ముంబై దాదాపు విజయతీరాలకు చేరింది. ఆఖర్లో రోహిత్ ఔటైనా, సూర్య మాత్రం బౌండరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 4.2 ఓవర్లలోనే ముంబై టార్గెట్ ను ఛేదించింది.