Munugode Bypolls Bjp : మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటి.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మునుగోడు ఉప ఎన్నిక కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.. బీజేపీ మండల ఇన్ చార్జ్ లతో పాటు సహ ఇన్ చార్జ్ లను నియమించారు.  సాధారణ ఎన్నికల  ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నికను భావిస్తున్నారు. అందుకే భారీగా నేతల్ని మోహరించి ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఓటర్లు అందర్నీ ఓ సారి కలవాలని..  షెడ్యూల్ వచ్చిన  తర్వాత మరో రెండు సార్లు కలిసి ఓటు  అభ్యర్థించాలని నిర్ణయించుకున్నారు. 


ప్రతి ఓటర్‌ను వ్యక్తిగతంగా కలిసేలా వ్యూహం


నియోజకవర్గానికి సంబంధించి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది కమలదళం. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామిని ఆ కమిటీ ఛైర్మన్ గా నియమించింది. స్టీరింగ్ కమిటీలో మరో 14 మంది సభ్యులుగా వ్యవహరించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ కో ఆర్డినేటర్గా నియమించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులగా కీలక నేతలను నియమించారు. దాదాపు కీలక సామాజికవర్గాలను ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. నియమించిన వెంటనే వివేక్ పని ప్రారంభించారు. ఉప ఎన్నికలు ఉన్నప్పుడే సీఎం కేసీఆర్ .. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధు, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గిరిజన బంధు ఇస్తానని అంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. 


చేరికలకు ప్రోత్సాహం 


ఉప ఎన్నిక కోసం ఛార్జ్ షీట్ తో పాటు మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. మరో వైపు  చాప కింద నీరులా ప్రత్యర్థి పార్టీలలో బలంగా ఉన్న నేతలను కాషాయ కండువా కప్పి పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీలలో ఉన్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన బలమైన నేతలను బీజేపీ తీర్థం పుచ్చుకునేలా చేస్తే ఆయా పార్టీలు బలహీన పడతాయని భావిస్తున్న క్రమంలో చేరికలపై దృష్టి సారించారు. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ, టిఆర్ఎస్ పార్టీ లోనూ టికెట్ విషయంలో చోటుచేసుకున్న అసమ్మతి, స్థానికంగా పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత కలహాలు బిజెపికి లాభం చేకూరుస్తున్నాయ. వరుసగా బీజేపీలో చేరే నేతల సంఖ్య పెరుగుతోంది. 


వచ్చే నెలలో షెడ్యూల్ వచ్చే అవకాశం 
 
మొత్తంగా వచ్చే నెలలో మునుగోడు షెడ్యూల్ రావటం పక్కా అని రాజకీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. నవంబరులో ఎన్నిక జరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్న నేపథ్యంలో... వ్యూహాలు రచించటంలో వేగం పెంచుతున్నారు. ప్రత్యర్థి పార్టీల బలబలాను అంచనా వేస్తూ ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి అధికారంగా ఖరారైతే పిక్చర్ క్లియర్ కట్ గా ఉంటుంది. వీటన్నింటిపై ఓ అంచనాతో ఉన్న కమలనాథులు.... ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.