Maa Robo: చాలా వరకు అమ్మలకు కొడుకులు, తండ్రులకు కూతుళ్లు విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఇంట్లో ఒక్కరే పిల్లలు ఉన్న వాళ్ల పరిస్థితి ఏమో కానీ.. ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం నాన్నంటే కూతురుకి, కూతురు అంటే నాన్నకు ప్రత్యేకమైన ప్రేమ కచ్చితంగా ఉంటుంది. ఎక్కువ శాతం అమ్మాయిలకు తన నాన్నే తన మొదటి హీరో అయి ఉంటాడు. అలాంటి ఓ దివ్యాంగురాలైన కూతురుకి కూడా ఆ నాన్న నిజంగా హీరోనే. తన కోసం ఇష్టమైన బొమ్మలో, ఆస్తి పాస్తులు ఇవ్వలేదు. కూతురుకు అన్నం తినిపించే వాళ్లు లేక, తినేటప్పుడు పాప పడుతున్న కష్టం చూసి చలించిపోయాడు. కూతురు కష్టాన్ని ఎలాగైనా తీర్చాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తన చిన్నారి పాప కోసం అద్భతమైన ఆవిష్కరణ చేశాడు. అన్నం తినిపించే రోబోను తయారు చేసి అందరి చేత ఆహా అనిపిస్తున్నాడు. 





భార్యా, కూతుళ్లను చూస్కోవడం ఇబ్బందిగా మారడంతో...


దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోరా గ్రామానికి చెందిన 40 ఏళ్ల కదమ్‌ దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. 40 ఏళ్ల బిపిన్ కదమ్ కు అనారోగ్యం పాలైన భార్య, దివ్యాంగురాలైన ఓ కూతురు ఉన్నారు. అయితే ఇన్నాళ్లు పాపను భార్యే కంటికి రెప్పలా కాపాడుకుంది. రెండేళ్ల క్రితం భార్య కూడా జబ్బుతో మంచాన పడింది. దీంతో వారిద్దరిని చూసుకునే బాధ్యత అతనిపై పడింది. ఓ వైపు పని చేసుకోవడం, మరోవైపు భార్యా, పిల్లలను చూస్కోవడం అతడికి చాలా ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా కూతురుకు తినిపించడం మరింత సమస్య కనిపించింది. దీంతో ఆ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ రోబో లాంటి పరిరాన్ని తయారు చేస్తే అదే తన కుమార్తెకు భోజనం పెట్టేందుకు సహకరిస్తుందని భావించాడు. కదమ్ కు సాంకేతికతపై ఎలాంటి అవగాహనా లేదు. అయినా తన కుమార్తె ఎదుర్కొంటున్న సమస్యకు సాంకేతికతే ఒక పరిష్కారం చూపుతుందని భావించి ఏడాది క్రితం నుంచి రోబో లాంటి పరికరం కోసం అన్వేషించాడు. 


ఏ కూర కావాలో చెప్తే రోబోనే కలిపేస్తుంది..


ఎక్కడా ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో తానే రోబో తయారు చేయాలనుకున్నాడు. ప్రతి రోజూ 12 గంటల పాటు ఇతర పనులు చేసుకొని వచ్చి మిగిలిన సమయంలో సాఫ్ట్ వేర్ పై అవగాహన పెంచుకున్నాడు. నాలుగు నెలలు శ్రమించి ఒక రోబోను తయారుచేసి దానికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు. పూర్తిగా వాయిస్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఆధారంగా ఇది పనిచేస్తుంది. రోబో చేతిలో ఉండే పళ్లెంలో ఆహారం పెడితే అది అమ్మాయికి తినిపిస్తుంది. వాయిస్‌ కమాండ్‌ను వాడుకుంటూ.. ఆహారాన్ని కూరతో లేదా పప్పుతో కలిపి తినాలని భావిస్తోందా అన్నది ఆ అమ్మాయి తెలియజేస్తే .. ఆ రోబో ఆ విధంగానే పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణను గోవా స్టేట్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ ప్రశంసించింది. ఈ పరికరాన్ని వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తోంది. కూతురు మీద ప్రేమతో తండ్రి తయారు చేసిన రోబో చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు.