Congress President Election: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పార్టీ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డాలంటే ఆ అభ్య‌ర్థి పేరును దేశంలోని 50 మంది పార్టీ డెలిగేట్స్ ప్ర‌తిపాదించాలి. దీంతో శ‌శి థ‌రూర్ ఐదు సెట్ల నామినేష‌న్ పేప‌ర్స్ సిద్ధం చేసుకుని వివిధ రాష్ట్రాల్లోని పార్టీ ప్ర‌తినిధుల‌ను సంప్ర‌దిస్తున్నారని తెలుస్తోంది.


దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి ఓ వ్యక్తి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని పార్టీ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ ఎప్పుడో నిర్ణయించుకున్నారు.


సోనియా ఓకే


ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నిర్ణయాన్ని థరూర్ ఆమె ముందు ఉంచగా.. "మీ ఇష్టం. అధ్యక్ష పదవి కోసం ఎవరైనా పోటీ పడవచ్చు" అంటూ సోనియా కూడా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. 


అయితే అధ్యక్ష బరిలో ఎవరు నిల్చున్నా తాను మాత్రం వ్యక్తిగతంగా ఎవరికీ మద్దతు ప్రకటించకుండా తటస్థంగా ఉంటానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. పోటీకి తాను సన్నద్ధమవుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే థరూర్‌ ప్రకటించారు. పార్టీలో అంతర్గత సంస్కరణలు చేపట్టాలని థరూర్ ఎప్పటి నుంచో కోరుతున్నారు.


గహ్లోత్


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా ప్రకటించారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని గహ్లోత్ స్పష్టం చేశారు.


" నేను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నామినేషన్ దాఖలు చేయడానికి నేను త్వరలో తేదీని ఫిక్స్ చేస్తాను. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితులు చూస్తే ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది.  "


-                                            అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం


రాహుల్ ఒప్పుకోలేదు


కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని తాను చాలా సార్లు రాహుల్ గాంధీని కోరానని, అయితే ఆయన తన విజ్ఞప్తిని తిరస్కరించారని గహ్లోత్ అన్నారు. 


" కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు (రాహుల్ గాంధీ) ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్త ఆకాంక్షిస్తున్నాడని, బాధ్యతలు తీసుకోవాలని నేను రాహుల్ గాంధీని చాలా సార్లు అభ్యర్థించాను. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్షుడిగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.                                               "




-  అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం



రాహుల్ సలహా


'భారత్‌ జోడో యాత్ర'లో ఉన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అత్యున్నత పదవికి ఎవరు పోటీ చేసినా అది కేవలం సంస్థాగత పదవి కాదని.. చారిత్రక స్థానమని అర్థం చేసుకోవాలన్నారు. ఆ పదవిలో ఎవరు ఉన్నా బాధ్యతగా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని రాహుల్ అన్నారు.


ఎర్నాకుళంలో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ చీఫ్‌కి ఇవ్వబోయే ఒక సలహా గురించి మీడియా అడిగినప్పుడు.. ఇలా అన్నారు.


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే వ్యక్తులు దేశ నిర్దిష్ట దృక్పథాన్ని ప్రతిబింబించే చారిత్రక స్థానాన్ని తీసుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి వెనుక ఓ చరిత్ర ఉంది. మీరు యావత్ దేశ ఆలోచనలు, నమ్మకం, విశ్వాసాలకు ప్రాతినిథ్యం వహించవలసి ఉంటుంది.                                                        "


-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత