Lok Sabha polls 2024:   యువ ఓటర్లు తమ మొదటి ఓటును దేశం కోసం వేయాలని ప్రధాని మోదీ కోరారు. రికార్డు స్థాయిలో భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపిచ్చారు.  18వ లోక్‌సభ  వారి ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న ఆశాభావం వ్యక్తంచేశారు.   ఆకాశవాణిలో ‘మన్‌ కీ బాత్‌’ 110వ ఎపిసోడ్‌లో ఆయన ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తున్నందున వచ్చే 3 నెలల పాటు ‘మన్‌ కీ బాత్‌’కు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. 111వ ఎపిసోడ్‌తో  ప్రజల ముందుకు వస్తానని వెల్లడించారు. అప్పుడు  యువత, నారీశక్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘అన్ని రంగాల్లో నారీశక్తి ముందుంది’ అన్నారు.                   


యువ  ఓటర్లతో రూపొందిన ఓ వీడియోను  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ షేర్ చేశారు. దాన్ని రీ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ #MeraPehlaVoteDeshKeLiye హ్యాష్ ట్యాగ్ తో ఈ ప్రచారాన్ని మరింత ఉద్ధృతంగా చేయాలని పిలుపునిచ్చారు.                


 





 


మహిళల కోసం తాము అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించారు. ‘కోటి మంది లక్షాధికారిణులను తయారుచేసే ‘లఖ్‌పతీ దీదీ’ పథకం అమలు చేస్తున్నాం. ‘నమో డ్రోన్‌ దీదీ’ స్కీం మన గ్రామాల్లో మహిళలను జీవితాలను మార్చేస్తోంది. ప్రకృతి సాగులో,జలసంరక్షణ, పారిశుద్ధ్యంలో మహిళలు తమ నాయకత్వ సామర్థ్యాన్ని చాటుకుంటున్నారు’ అని కొనియాడారు. మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం జరుపకోనున్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు.                                                 


ప్రభుత్వ కృషి కారణగా గడచిన కొన్నేళ్లలో పెద్దపులుల సంఖ్య పెరిగిందన్నారు. మాదకద్రవ్యాలకు యువత బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన మోదీ.. ఈ మహమ్మారిపై పోరాటానికి పటిష్ఠ కుటుంబాలు అవసరమన్నారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు ‘గాయత్రీ పరివార్‌’ నిర్వహించిన ‘అశ్వమేథ యాగం’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా ఆయన ప్రసంగించారు. కుటుంబసభ్యులంతా తరచూ మాట్లాడుకోవాలని, అప్పుడే బంధాలు బలపడతాయని, కుటుంబ విలువలు పెరుగుతాయని చెప్పారు. కాగా, పశుసంవర్ధకం గురించి మాట్లాడితే జనం గోవులు, గేదెల పెంపకం గురించి మాత్రమే అనుకుంటున్నారని.. కానీ మేకలు కూడా ముఖ్యమైనవని ప్రధాని పేర్కొన్నారు. ఒడిసాలోని కలహండి జిల్లా సాలెభటా గ్రామానికి చెందిన దంపతుల గురించి ప్రస్తావిస్తూ.. వారు సృష్టించిన ‘గో మణికస్తు మేకల బ్యాంకు ’ను కొనియాడారు.