IPL 2025 Big Shock To LSG: లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ ఈ సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. వెన్ను నొప్పి తిర‌గ‌బెట్ట‌డంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ నుంచి ఔట‌య్యాడు. నిజానికి గ‌తేడాదిగా గాయాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న మ‌యాంక్.. ఈ ఏడాది ఐపీఎల్లోనే పున‌రాగ‌మ‌నం చేశాడు. గ‌తేడాది ఐపీఎల్లో 150+ వేగంతో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన మ‌యాంక్.. ఆ సీజ‌న్ లో అద‌ర‌గొట్టాడు. అయితే అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 9 టీ20లే ఆడ‌టం గ‌మ‌నార్హం. ఎక్కువ‌గా వెన్ను నొప్పితో త‌ను రిహాబిలిటేష‌న్ కే ప‌రిమితం అవుతున్నాడు. గతేడాది ఐపీఎల్ త‌ర్వాత బంగ్లాదేశ్ తో సిరీస్ కోసం జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చాడు. అయితే ఆ త‌ర్వాత వెన్నునొప్పి తిర‌గ‌బెట్ట‌డంతో మ‌ళ్లీ పున‌రావాసానికే పరిమితం అయ్యాడు. ఇక తాజా ఐపీఎల్లో ల‌క్నో త‌ర‌పున రెండు మ్యాచ్ లు ఆడిన మ‌యాంక్.. వంద ప‌రుగులిచ్చి, కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే తీశాడు. 

ప‌డిపోయిన వేగం.. గాయం కార‌ణంగా మ‌యాంక్ వేగం ప‌డిపోయింది. క‌నీసం 15 కిమీ త‌క్కువ స్పీడ్ తో త‌ను బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే బౌలింగ్ యాక్ష‌న్ లోనూ మార్పు వ‌చ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. కేవ‌లం 22 ఏళ్ల వ‌యసులో దూసుకొచ్చిన ఈ యువ‌కెర‌టం గాయాల కార‌ణంగా వెనుకంజ వేయ‌డంతో విశ్లేష‌కులు పెద‌వి విరుస్తున్నారు. బీసీసీఐ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్న మ‌యాంక్.. తాజా గాయాల‌తో త‌ను స‌త్తా చాటాలేక పోతున్నాడు. గ‌తేడాదిగా వేళ్ల మీద లెక్క‌పెట్ట‌గ‌లిగే మ్యాచ్ ల‌నే త‌ను ఆడాడు. సుదీర్ఘ‌కాలం పునరావాసంలో ఉండ‌టంతోపాటు చికిత్స త‌ర్వాత గాయాలు మ‌ళ్లీ తిర‌గ‌బెట్ట‌డం బీసీసీఐని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. 

సీఏఈ వైఫ‌ల్య‌మైనా..?సుదీర్ఘ‌మైన పున‌రావాసం తీసుకున్న త‌ర్వాత కూడా గాయాలు మ‌ళ్లీ తిర‌గ‌బెట్ట‌డంతో సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సీ ప‌నితీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. బెంగ‌ళూరులో గ‌తంలో ఎన్సీఏ పేరుతో ప‌రిచిత‌మైన ఈ సంస్థ పేరును ఎస్ఓఈ గా మార్చారు. ఇక పునరావాసం, చికిత్స తర్వాత కూడా  మ‌యాంక్ తోపాటు మ‌రో స్పీడ్ స్ట‌ర్ ఉమ్రాన్ మాలిక్ కూడా గాయాల‌తో ఆట‌కు దూరం కావ‌డం, అక్క‌డి నిపుణుల ప‌నితీరును ప్ర‌శ్నించేలా చేస్తోంది. ఇక మ‌యాంక్ విష‌యానికొస్తే త‌ను పూర్తిగా కోలుకోక‌ముందే ఒత్తిడికి త‌లొగ్గి ఫిట్ నెస్ స‌ర్టిఫికేట్ ఇచ్చారా..? అనే డౌట‌నుమానం వ్య‌క్తం అవుతుంది. ఏదేమైనా త‌న స్పీడ్ తో క్రికెట్ ప్రేమికుల‌ను పుల‌క‌రించేలా చేసిన మ‌యాంక్.. ఇలా గాయాల‌తో ఆట‌కు దూరం కావ‌డం స‌గ‌టు అభిమానుల‌ను క‌లవ‌ర‌ప‌రుస్తోంది. ఏదేమైనా ఈ సీజ‌న్ లోనైనా స‌త్తా చాటాల‌ని భావించిన ల‌క్నో యాజ‌మాన్యానికి.. గాయం తిర‌గబెట్ట‌డంతో మ‌యాంక్ దూరం కావ‌డం షాక్ గా మారింది. అత‌ని స్థానంలో న్యూజిలాండ్ కు చెందిన విలియం ఓ రౌర్క్ ను రీప్లేస్మెంట్ గా తీసుకుంది. తను సత్తా చాాటాలని లక్నో సూపర్ జెయింట్స్  టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.