Telangana Government GO For 5oo Rupees Gas Cylinder: రాష్ట్రంలో అర్హులైన వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు మరో కీలక అడుగు పడింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీ సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులను గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి తక్షణం నియమావళి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 


పథకం అమలు ఇలా


రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకు తీసుకువస్తున్నారు. అయితే, పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రూ.500 అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ (DBT - Direct Benefit Transfer) ద్వారా రీయింబర్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తోన్న రూ.40 రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.955 ఉంటే.. వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.40 పోనూ మిగతా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని తెలుస్తోంది.


ఉచిత విద్యుత్ పథకం


మరోవైపు, 'గృహజ్యోతి' పథకం కింద 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపచేయనుంది. మీటర్ రీడింగ్ కు వెళ్లినప్పుడు దరఖాస్తుదారుల ఆధార్, తెల్లరేషన్ కార్డులను విద్యుత్ సిబ్బంది పరిశీలించారు. అయితే, ఇంకా కొన్ని చోట్ల పరిశీలన పూర్తి కాలేదు. ఎంపికైన లబ్ధిదారులకు మార్చిలో జీరో విద్యుత్ బిల్లు ఇవ్వనున్నారు.


Also Read: Chalo Medigadda: మార్చి 1 నుంచి చలో 'మేడిగడ్డ'కు బీఆర్ఎస్ పిలుపు - కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తామన్న కేటీఆర్