Chandrababu Responds on Hanumavihari Issue: రాష్ట్రంలో వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. క్రికెటర్ హనుమవిహారి (Hanuma Vihari) విషయంపై మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారి.. ఏపీ తరఫున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని ఆరోపించారు. హనుమవిహారికి తాము అండగా ఉండి అతనికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 'హనుమ విహారి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆట పట్ల అతనికున్న చిత్తశుద్ధిని వైసీపీ కుట్రా రాజకీయాలు నీరు గార్చలేవు. అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ప్రోత్సహించరు.' అని అన్నారు.
నారా లోకేశ్ ట్వీట్
అటు, అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్రా క్రికెట్ నుంచి హనుమ విహారి నిష్క్రమించడం ఆశ్చర్యం కలిగిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. '2 నెలల్లో ఏపీ తరఫున తిరిగి ఆడడానికి హనుమ విహారి రావాలి. విహారి, అతని జట్టుకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతాం. ఆంధ్రా క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం.' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
'ఎంతటి అవమానం.?'
క్రికెటర్ హనుమవిహారి అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ కార్పొరేటర్ కోరుకున్న కారణంగానే విహారి కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని మండిపడ్డారు. 'హనుమ విహారి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆటలో మంచి ప్రతిభ కనబరిచారు. భారత్, ఆంధ్ర కోసం తన సర్వస్వం ఇచ్చారు. మన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు ఇండియన్ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ టీం కెప్టెన్ కంటే క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లేని స్థానిక వైసీపీ రాజకీయ నాయకుడే చాలా విలువైన వాడు. ఎంతటి అవమానం. సీఎం జగన్ గారూ.. మన ఆంధ్రా క్రికెట్ టీం కెప్టెన్ ను అవమానించినప్పుడు 'ఆడుదాం ఆంధ్రా' వంటి ఈవెంట్లలో కోట్లాది డబ్బు ఖర్చు చేయడం ఏంటి.?. ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ బోర్డుతో వచ్చే ఏడాది హనుమ విహారి మళ్లీ ఆడతారని ఆశిస్తున్నా.' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
షర్మిల తీవ్ర ఆగ్రహం
హనుమ విహారి అంశంలో వైసీపీపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్లు, ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికారమదాన్ని చూపుతున్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్లు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు, అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా? ఈ విషయంపై వెనువెంటనే నిస్పాక్షికమైన విచారణ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.' అని ట్వీట్ చేశారు.
Also Read: AP MLAs Disqualified: 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన ఏపీ స్పీకర్