IND W VS ENG W News: వచ్చే నెలలో ఇంగ్లాండ్ లో ప‌ర్య‌టించ‌బోయే భారత మ‌హిళా జ‌ట్టును బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ తాజాగా ప్ర‌క‌టించింది. జూన్ 28 నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ ప‌ర్య‌ట‌న‌లో ఐదు టీ20ల సిరీస్, జూలై 16 నుంచి మూడు వ‌న్డేల సిరీస్ ప్రారంభ‌మ‌వుతుంది. ఇటీవ‌ల శ్రీలంక‌లో జ‌రిగిన ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ లో గెలిచి ఊపుమీదున్న భార‌త్.. ఈ ప‌ర్య‌ట‌న‌లోనూ స‌త్తా చాటాల‌ని త‌హ‌త‌హలాడాల‌ని భావిస్తోంది. సౌతాఫ్రికా, లంక పాల్గొన్న ఈ సిరీస్ లో ఫైన‌ల్లో ఆసియా చాంపియ‌న్ లంక‌ను చిత్తు చేసి విజేత‌గా నిలిచింది. చాలా రోజుల త‌ర్వాత విధ్వంస‌క ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ‌, ఆల్ రౌండ‌ర్ స్నేహ్ రాణాకు పొట్టి ఫార్మాట్ లో చోటు ద‌క్కింది. ఇక పేస్ బౌలింగ్ ఆల్ రౌండ‌ర్లు క్రాంతి గౌడ్, స‌యోలీ స‌త్ఘ‌రే, స్పిన్న‌ర్లు శ్రీ చ‌ర‌ణి, శుచి ఉపాధ్యాయ‌ల‌కు తొలిసారిగా టీ20 జ‌ట్టులో చోటు ద‌క్కింది. 

నాటింగ్ హామ్ లో తొలిపోరు.. నాలుగు వారాల‌పాటు జ‌రిగే ఈ టూర్ ను జూన్ 28న నాటింగ్ హామ్ లో జ‌రిగే తొలి టీ20తో భార‌త్ ఆరంభిస్తుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా జూలై 1 న బ్రిస్ట‌ల్ లో రెండో టీ20, నాలుగున ఓవ‌ల్ లో మూడో టీ20, 9న‌ మాంచెస్ట‌ర్ లో నాలుగో టీ20, 12న బ‌ర్మింగ్ హాంలో ఐదో టీ20ని ఆడుతుంది. ఆ త‌ర్వాత 16 జూలై నుంచి మొద‌లయ్యే వ‌న్గే సిరీస్ లో తొలి మ్యాచ్ ను సౌతాంప్ట‌న్ వేదిక‌గా ఆడుతుంది. ఆ త‌ర్వాత అదేనెల 19న క్రికెట్ మ‌క్కా లార్డ్స్ లో రెండో వ‌న్డే, 22న ఆఖ‌రిదైన మూడో వన్డేను చెష్ట‌ర్ లీ స్ట్రీట్ లో ఆడుతుంది.  ఈ రెండు ఫార్మాట్ల‌కు కెప్టెన్ గా హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన బాధ్య‌త‌లు మోయ‌నుంది. 

ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కు భార‌త‌ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్), యాస్తికా భాటియా (వికెట్‌ కీపర్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, నల్లపురెడ్డి శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే.

ఇంగ్లాండ్ తో వ‌న్డే సిరీస్ కు భార‌త జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్‌, అమన్‌జ్యోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్. సయాలీ సత్‌ఘరే.